CHANDRABABU NAIDU: ఏపీ సీఎం జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదని, అక్కడి భూములపైనే ప్రేమ ఉందని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. ‘‘జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదు. ఇక్కడి భూములపైనే ప్రేమ. విశాఖలో రూ.40వేల కోట్ల భూములు కొట్టేశారు. విశాఖను గంజాయి, నేరాలకు రాజధానిగా మార్చారు. ఐదేళ్ల జగన్ పాలన.. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది.
YS SHARMILA: మద్యపాన నిషేధం అని చెప్పి నాసిరకం మద్యం అమ్ముతారా.. జగన్‌పై షర్మిల ఫైర్
జగన్ పాలనలో.. విశాఖకు వచ్చిన అన్ని కంపెనీలు పారిపోయాయి. వైసీపీ పాలనలో అందరూ బాధితులే. అందులో నేనూ ఉన్నా. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వంటి నాయకులపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి, ఇబ్బందులకు గురిచేసింది. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్న దొంగ ప్రభుత్వం ఇది. వైసీపీ హయాంలో పేదలు నిరుపేదలయ్యారు. ఆ పార్టీ నేతలు ధనవంతులయ్యారు. టీడీపీ హయాంలో 2029 విజన్‌ను రూపొందించాం. 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రంగా ఏపీ ఉండేది. ఒక్క ఛాన్స్ అంటూ అడగ్గా.. నమ్మి ఓటేసిన ప్రజల్ని సీఎం జగన్ మోసం చేశారు. నమ్మి ఓటు వేసిన ప్రజల్ని జగన్ మోసం చేశారు. భస్మాసురుడిలా జగన్ ప్రజల నెత్తిన చేయి పెట్టారు. ఓటుతో కలియుగ భస్మాసురుడిని అంతం చేయాలి. ఇప్పుడు మీ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలి. టీడీపీ, జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు.
కరెంట్ ఛార్జీలు సహా అన్నింటిపై ధరలు పెంచి, ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్.. పేదల వ్యక్తి ఎలా అవుతారు? శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా బలహీనవర్గాలు ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా వారిని ఆదుకోవడం టీడీపీ, జనసేన ప్రభుత్వం బాధ్యత. మా ప్రభుత్వం ఏర్పడ్డాక.. కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. చెత్త పన్నును ఎత్తివేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తాం. వర్క్ ఫ్రమ్ హోం పని విధానానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తాం. రైతులకు సబ్సిడీలు అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక సూపర్ 6 హామీలు అమలు చేస్తాం. పలాసలో ఢిపెన్స్ కోచింగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేసి డిక్లరేషన్ ప్రకటిస్తాం. పెట్రోలు ధరలను నియంత్రిస్తాం. రోడ్లపై గుంతల వల్ల 27 మంది మృతి చెందారు. అయినా వారికి సంపాదనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదు. మేము అధికారంలోకి వస్తే సుజల స్రవంతి ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్ర నీటి సమస్యను తీరుస్తాం.’’అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.