ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ హీటెక్కింది. ఆ హీట్ హైదరాబాద్ ను కూడా తాకింది. భాగ్యనగరంలోని ఆంధ్రుల జనాభా ఎక్కువే. చంద్రబాబు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. అందుకే సహజంగానే టీడీపీ చీఫ్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా నిరసన తెలపొచ్చు. ఎక్కడో విదేశాల్లో జరిగే ఘటనలపై భారత్ లో నిరసనలు తెలిపే అవకాశం కల్పిస్తున్నప్పుడు.. పొరుగునే ఉన్న రాష్ట్రంలో జరిగిన నిరసనకు హైదరాబాద్ లో నిరసన తెలపకుండా అడ్డుకోవడం న్యాయం కాదు. ‘‘చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీలోని రెండు పార్టీల మధ్య విషయం. దాని గురించి హైదరాబాద్ లో ర్యాలీలు తీయడం సరికాదు. ఏపీకి చెందిన విషయానికి ఆందోళనలు అక్కడే చేయాలి. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి. నిరసన ప్రదర్శనలు చేయడానికి విజయవాడ, అమరావతి లేవా?’’ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ లోని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకొని ఇక తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నా.. దాని ప్రాంతీయతత్వ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని కేటీఆర్ వ్యాఖ్యలతో తేటతెల్లం అయిందని అంటున్నారు. విశాల దృక్పథం, జాతీయ ఎజెండా ఉన్న రాజకీయ పార్టీల నేతలు ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని రాజకీయ పరిశీలకులు కూడా సూచిస్తున్నారు.
కేటీఆర్ కు వైసీసీ సపోర్ట్..
జగన్, చంద్రబాబు, పవన్ అందరూ తనకు మిత్రులే అంటూనే.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ లోని ఏపీ ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్లి మహారాష్ట్రలో నిరసన కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ .. తెలంగాణలో నిరసన తెలపొద్దని ఏపీవాసులకు నిబంధనలు పెట్టడం సముచితం కాదని వాదిస్తున్నారు. ‘‘నాకు లోకేష్ ఫోన్ చేసి హైదరాబాద్ లో ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వమని అడిగితే.. హైదరాబాద్ లో శాంతి భద్రతలు మాకు ముఖ్యమని చెప్పాను. ఏపీ నుంచి ఎంతో మంది ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ల పెట్టుబడులు, భవిష్యత్తు బాగుండాలి. అలా ఉండాలంటే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉండాలని లోకేశ్ కు చెప్పాను’’ అని కేటీఆర్ తాజాగా వెల్లడించారు. ఏదిఏమైనప్పటికీ కేటీఆర్ కామెంట్స్ బీఆర్ఎస్‌కు రాజకీయంగా నష్టం తెస్తాయని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇక వైసీపీ మాత్రం బీఆర్ఎస్‌కు మద్దతుగా మాట్లాడుతోంది. కేటీఆర్ మాటల్లో తప్పేం ఉందని వాదిస్తోంది.
కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మరికొందరు నేతలు..
సీఎం కేసీఆర్.. కుమారుడికి మంత్రి పదవి, కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి, మేనల్లుడికి మంత్రి పదవి, తోడల్లుడి కుమారుడికి రాజ్యసభ పదవిని ఇచ్చారు. కొన్ని నెలల క్రితం కేసీఆర్ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వచ్చాడు. కేసీఆర్ అన్న రంగారావు పెద్ద కొడుకు కల్వకుంట్ల వంశీధర్‌రావుకు మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను అప్పగించారు. దీంతో మహారాష్ట్రలోనూ కల్వకుంట్ల ఫ్యామిలీనేనా అని సోషల్ మీడియాలో నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి వంశీధర్‌రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేయాలని భావించారు.గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో సిద్దిపేట టికెట్ ఆశించినా దక్కలేదు. నాటి నుంచి కేసీఆర్‌తోనే ఉంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి కేసీఆర్ అన్న రంగారావు అల్లుడు రేగులపాటి మధుసూదన్‌రావు కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రంగారావు మరో కుమారుడు తేజేశ్వర్రావు అలియాస్ కన్నారావు ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్నారు. ఆయన కూడా రాజకీయాలపై కన్నేశారని ప్రచారం జరుగుతోంది.