ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మొత్తానికి అనుకున్నది సాధించింది. పట్టు వీడని విక్రమార్కుడిలా చందమామను అందుకుంది. జులై 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిపి జాబిల్లిపై ఇస్రో ముద్ర వేసింది. 14 రోజుల పాటు చంద్రయాన్3 జాబిల్లిపై ఎలాంటి ప్రయోగాలు చేయబోతోంది.. వాటివళ్ల ఇండియాకు వచ్చే లాభాలేంటి.. అసలు చంద్రయాన్3లో ఎలాంటి పరికరాలను ఇస్రో చంద్రుడిపైకి పంపింది.. ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్నలు ఇవే.
చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు మొత్తం 7 కీలక పరికరాలను చంద్రయాన్‌లో ఏర్పాటు చేసింది ఇస్రో. విక్రమ్ ల్యాండర్‌లో 4 పరికరాలు, పగ్యాన్ రోవర్‌లో 2 పరికరాలు, ప్రొపల్షన్ మాడ్యుల్‌లో 1 ఏర్పాటు చేసింది. చంద్రయాన్2లో ప్రయోగించిన ఆర్బిటార్ ఇంకా చంద్రుడి కక్షలోనే ఉంది. అందుకే చంద్రయాన్3లో ఆర్బిటార్‌ను పంపించలేదు. పాత ఆర్బిటార్ నుంచే డేటా ట్రాన్స్‌ఫర్ జరిగింది. ప్రొపల్షన్ మాడ్యూల్‌లో “స్పెక్ట్రో పొలామెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెటరీ ఎర్త్” అనే పరికరం ఉంటుంది. ఇది చంద్రుడి చుట్టూ తిరుగుతూ విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా అనే విషయంపై పరిశోధనలు చేస్తుంది. 3 నుంచి 6 నెలల పాటు పరిభ్రమించేలా దీన్ని ఇస్రో డిజైన్ చేసింది. ఇది తాను సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బెంగళూరులోని డీప్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌కు పంపుతుంది.
ఇక విక్రమ్ ల్యాండర్‌లో “రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయానోస్పియర్ అండ్ అట్మాస్పియర్” అనే పరికరం ఉంటుంది. ఇది చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా సాంద్రతను పరిశీలిస్తుంది. చంద్రుడిపై అయాన్లు, ఎలక్ట్రాన్ల స్థాయి, వాటిలో వచ్చే మార్పులను విశ్లేషిస్తుంది. “చంద్రా థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్ థర్మల్” అనే మరో పరికరం కూడా ఇందులో ఉంది. ఇంది చంద్రుడిపై ఉండే థర్మల్ ప్రాపర్టీస్ గురించి పరిశోధిస్తుంది. “ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ” అనే పరికరాన్ని కూడా ల్యాండర్‌లో అమర్చారు. ఇది చంద్రుడిపై విక్రమ్ ల్యాండ్ అయినప్పుడు జరిగిన మార్పులు, భవిష్యత్తులో చంద్రుడిపై ప్రకంపణలు వచ్చే ప్రమాదాల గురించి పరిశోధిస్తుంది. ఇక ప్రగ్యాన్ రోవర్‌లో కూడా రెండు ప్రధాన పరికరాలను అమర్చింది ఇస్రో. “లేజర్ ఇండ్యూస్ట్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్” అనే పరికరాన్ని అమర్చింది. ఇది అత్యంత కీలకమైంది. చంద్రుడి ఉపరితలంపై లేజర్ కిరణాలు ప్రసరించి వాటి ద్వారా వచ్చే వేడి ఆధారంగా అక్కడ రసాయనిక చర్యలను జరుపుతుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే ల్యాండర్‌కు పంపిస్తుంది.
చంద్రుడిపై మెగ్నీషియం, అల్యుమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం నిక్షేపాలను గుర్తించి వాటిపై ఇది ప్రయోగాలు చేస్తుంది. దాంతోపాటే “ఆల్ఫా పార్టికల్ స్పెక్ట్రోమీటర్”ను కూడా ప్రగ్యాన్ రోవర్‌లో అమర్చారు. ఈ రెండు చంద్రుడిపై మనుషులు నివసించాడినికి గల సాధ్యాసాధ్యాలను పరిశోధిస్తాయి. భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తాయి. ఇలా 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు జరుగుతాయి. చంద్రడిపై ఒక పగలు అంటే అది భూమి మీద 14 రోజులకు సమానం. 14 రోజుల తర్వాతక చంద్రయాన్3 ఉన్న ప్రాంతంలో మళ్లీ చీకటి వస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీలకు పైగా ఉంటుంది. ఇంత చలిలో చంద్రయాన్3 పని చేయదు. దీంతో ఈ 14 రోజులు జరిగే ప్రయోగాలే అత్యంత కీలకం. భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోయే మూన్ మిషన్స్‌కు ఇది మొదటి మెట్టు కానుంది.