ELECTION CAMPAIGN: ఎన్నికల ప్రచారం.. హెలికాప్టర్, విమానాల రెంట్లు ఎంతో తెలుసా..

ఇప్పుడు విమానాలు, హెలికాప్టర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. చార్టర్డ్ ఫ్లైట్స్, హెలికాప్టర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం వీటి అద్దెలు డబుల్ అయ్యాయని మార్కెట్ వర్గాలంటున్నాయి.

  • Written By:
  • Publish Date - April 14, 2024 / 06:34 PM IST

ELECTION CAMPAIGN: ఎన్నికలొచ్చాయంటే నాయకులు ప్రచారం చేయాల్సిందే. అప్పటిదాకా జనాలకు పెద్దగా కనిపించని నేతలు కూడా జనంలోకి వస్తుంటారు. జాతీయస్థాయి నేతలైతే అనేక రాష్ట్రాలు పర్యటించాలి. ఇందుకోసం ప్రత్యేక విమానాల్ని వాడుతుంటారు. ఇక రాష్ట్రస్థాయి నేతలైతే.. తమ రాష్ట్రమంతా తిరిగేందుకు హెలికాప్టర్లు వాడుతుంటారు. దీంతో ఇప్పుడు విమానాలు, హెలికాప్టర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. చార్టర్డ్ ఫ్లైట్స్, హెలికాప్టర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది.

YS JAGAN: జగన్‌పై దాడి.. ప్రచారంలో మార్పు చేస్తారా.. జగన్‌కు జనం దూరమేనా..?

ప్రస్తుతం వీటి అద్దెలు డబుల్ అయ్యాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. సాధారణంగా విమానాలు, హెలికాప్టర్లకు గంటల లెక్కన చార్జీలు వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం సింగిల్ ఇంజన్ హెలికాప్టర్లకు గంటకు ఏకంగా రూ.1.50 లక్షల వరకు రేటును వసూలు చేస్తున్నారు. ట్విన్ ఇంజిన్ కలిగిన హెలికాప్టర్‌కు గంటకు రూ.1.5 లక్షల నుంచి రూ.1.7 లక్షల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఛార్టర్డ్ విమానానికి గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షలు చార్జి వసూలు చేస్తున్నారు. సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌లో పైలట్‌ సహా 7 మంది కూర్చునే సౌకర్యం ఉంటుంది. ట్విన్ ఇంజన్ హెలికాప్టర్‌లో 12 మంది కూర్చోవచ్చు. గత ఎన్నికల సీజన్‌తో పోలిస్తే ఈ రేట్లు చాలా ఎక్కువ. సాధారణ సమయాల్లో వీటి ఛార్జీలు తక్కువగానే ఉంటాయి. మార్కెట్లో ప్రైవేట్, చార్టెడ్ ఫ్లైట్స్ తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడున్న డిమాండ్‌కు అనుగుణంగా అవి అందుబాటులో లేవు. అందుకే ఈ సేవలు అందిస్తున్న సంస్థలు ప్రస్తుతం ఇతర విమానయాన సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి.

ఆయా సంస్థలకు ఉన్న చిన్న విమానాలను ‘వెట్ లీజు’ తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. వెట్ లీజ్ అంటే.. విమానాన్ని సిబ్బందితోపాటు, ఇన్సూరెన్స్‌, విమానంలో అందించే ఇతర సౌకర్యాలన్నీ కలిపి తీసుకునే లీజు. ఈ తరహా లీజు వల్ల విమానం లేదా హెలికాప్టర్లను లీజ్‌కు తీసుకునే సంస్థలపై పెద్దగా నిర్వహణ భారం ఉండదు. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో ఇక్కడ హెలికాప్టర్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏపీతోపాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల్లో హెలికాప్టర్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఈసారి ఎన్నికలకు ఎక్కువ సమయం ఉండటం వల్ల కూడా వీటికి డిమాండ్ పెరిగింది.