ChatGPT: చాట్ జీపీటీతో ఉద్యోగాల కోత తప్పదా?

ఆన్‌లైన్‌లో ఉన్న బోలెడంత సమాచారాన్ని యూజర్లకు కావాల్సినట్లుగా అందిస్తోంది చాట్‌జీపీటీ. ఈ తరహా సేవలపై మైక్రోసాఫ్ట్‌తోపాటు గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు కూడా దృష్టిపెట్టాయి. దీని ద్వారా వివిధ సంస్థలు మానవ వనరుల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - April 7, 2023 / 07:35 PM IST

ChatGPT: ప్రస్తుతం ఆన్‌లైన్ ప్రపంచాన్ని ఊపేస్తోంది చాట్‌జీపీటీ. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో నడిచే చాట్‌జీపీటీ ఇప్పుడో సెన్సేషన్. ఆన్‌లైన్‌లో ఉన్న బోలెడంత సమాచారాన్ని యూజర్లకు కావాల్సినట్లుగా అందిస్తోంది చాట్‌జీపీటీ. ఈ తరహా సేవలపై మైక్రోసాఫ్ట్‌తోపాటు గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు కూడా దృష్టిపెట్టాయి. దీని ద్వారా వివిధ సంస్థలు మానవ వనరుల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని ద్వారా మనుషులు చేసే పనే ఏఐ, చాట్‌జీపీటీ వంటివి చేస్తాయి. దీంతో కోట్ల సంఖ్యలో నిపుణులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కంపెనీలు వెనక్కి తగ్గడం లేదు. మానవాళికి పెనుముప్పుగా భావిస్తున్న ఏఐ, చాట్‌జీపీటీ వంటి టెక్నాలజీ విషయంలో ప్రపంచ దేశాల వైఖరేంటి? మన దేశం ఎలా స్పందిస్తుంది?

ఆర్థిక మాంద్యంతోపాటు ఇతర అనేక కారణాల వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. భారీ టెక్ సంస్థలు కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉద్యోగ నియామకాలు కూడా తగ్గొచ్చని మరో అంచనా. ఎందుకంటే ఉద్యోగుల స్థానాన్ని చాట్‌జీపీటీ, ఏఐ వంటివి భర్తీ చేస్తాయని నిపుణుల నమ్మకం. అందుకే ఉద్యోగులు తమ జాబ్స్ నిలబెట్టుకోవాలంటే మరిన్ని స్కిల్స్ పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఏ దేశం ఎలా స్పందిస్తుందంటే..


అమెరికా
టెక్నాలజీ రంగంలో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది అమెరికా. అందుకే కొత్తగా విస్తరిస్తున్న ఏఐ, చాట్‌జీపీటీపై అమెరికా దృష్టి సారించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ రంగాలకు చెందిన నిపుణులతో సమీక్ష నిర్వహించారు. వేగంగా విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ ప్రపంచానికి ప్రమాదంగా మారే అవకాశం ఉందని బైడెన్ అభిప్రాయపడ్డారు. అలాగని ప్రస్తుతానికి ఈ టెక్నాలజీపై ఎలాంటి నిషేధం విధించలేదు. చట్టబద్ధత కూడా కల్పించలేదు. అయితే, అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ మాత్రం ఏఐ టెక్నాలజీ వినియోగం విషయంలో కంపెనీలకు పలు సూచనలు చేసింది. అమెరికాలో చాలా మంది చాట్‌జీపీటీని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ సంస్థకు వ్యతిరేకంగా అనేక కేసులు నమోదు చేశారు.
చైనా
అమెరికాను వ్యతిరేకించే చైనా ఆ దేశం అభివృద్ధి చేస్తున్న ఏఐ, చాట్‌జీపీటీని నిషేధించింది. ఏఐ ఆధారిత టూల్స్ వాడకుండా చర్యలు తీసుకుంది. ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా అమెరికా అనైతిక చర్యలకు పాల్పడుతోందని చైనా విమర్శించింది. కానీ, చాట్‌జీపీటీ కాకుండా, అమెరికాకు పోటీగా సొంత ఏఐ ఆధారిత టెక్నాలజీని చైనా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. దీనికోసం భారీ స్థాయిలో నిధులు వెచ్చిస్తోంది.
ఇండియా
టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించే ఇండియా ఏఐ, చాట్‌జీపీటీ వంటి టెక్నాలజీ విషయంలో సానుకూలంగానే స్పందిస్తోంది. అయితే, సొంత ఏఐ టూల్‌ను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. టెక్నాలజీ రంగంలో భారీ పెట్టుబడులకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏఐ టూల్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, దీన్ని ఎలా వాడాలి అనే విషయంలో కచ్చితమైన నిబంధనల్ని కేంద్రం రూపొందించలేదు. త్వరలోనే దీనిపై నిబంధనలు, మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉంది.


రష్యా
ప్రస్తుతం రష్యా ఈ తరహా టెక్నాలజీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇప్పుడు యుక్రెయిన్‌పై యుద్ధం చేయడంమీదే ఆ దేశం ప్రధానంగా దృష్టి సారించింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంటర్నెట్ వినియోగంపైనే రష్యా అనేక ఆంక్షలు విధించింది. అందువల్ల ఏఐ, చాట్‌జీపీటీ వంటివి వాడే అవకాశం అక్కడి ప్రజలకు లేదు. అమెరికా తన టెక్నాలజీ ద్వారా రష్యాపై సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని రష్యా భావిస్తోంది. అందుకే ఇప్పటికిప్పుడు ఏఐ టెక్నాలజీ, చాట్‌జీపీటీని రష్యా అనుమతించే అవకాశం లేదు.
ఈయూ
యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో 27 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ దేశాలు టెక్నాలజీ వాడకం, డేటా సెక్యూరిటీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఏఐ, చాట్‌జీపీటీకి అనుమతించడం లేదు. చాట్‌జీపీటీ వాడాలంటే డేటా భద్రత గురించిన సమాచారం ఇవ్వాలని ఓపెన్ఏఐ సంస్థను ఈయూకు చెందిన అనేక దేశాలు కోరాయి. ఈ సమాచారం ఆధారంగా చాట్‌జీపీటీపై నిర్ణయం తీసుకుంటాయి. ఇటలీ ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. జర్మనీ కూడా తమ దేశంలో ఏఐ ఆధారిత టూల్స్ వినియోగిండచంపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది.
బ్రిటన్
చాట్‌జీపీటీ విషయంలో యూరప్ దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ కూడా ఆచితూచి స్పందిస్తోంది. చాట్‌జీపీటీ వంటి ఏఐ సాంకేతికత వాడకం విషయంలో తగిన నిబంధనలు, మార్గదర్శకాల్ని రూపొందించే పనిలో ఉంది. ఈ విషయంలో టెక్ కంపెనీలు పారదర్శకంగా, సురక్షితంగా వ్యవహరించాలని బ్రిటన్ ఆయా కంపెనీలకు సూచించింది.