ఐపీఎల్ మెగావేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల చివరివారంలో సౌదీ అరేబియా సిటీ జెడ్డాలో ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ పూర్తవగా… అటు వేలంలో పోటీపడే ఆటగాళ్ళ జాబితా కూడా వచ్చేసింది. ఐపీఎల్ మెగా వేలంలో మొత్తం 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయ ఆటగాళ్లు కదా, 409 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో 320 క్యాప్డ్ ప్లేయర్లు, 1,224 అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీలతో సంప్రదింపుల తర్వాత ఆటగాళ్ల జాబితాను తగ్గించనున్నారు. రికార్డు స్థాయి ధరకు ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయని భావిస్తున్న స్టార్ ప్లేయర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో తమ పేర్లను లిస్ట్ చేసుకున్నారు.
ఈ సారి మెగావేలంలో హాట్ పిక్ గా భావిస్తున్న పంత్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పంత్ కోసం పోటీపడే జట్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ కాస్త వెనుకే ఉందని సమాచారం. తాజాగా ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ చేసిన కామెంట్సే దీనికి నిదర్శనం. పంత్ తో పాటు టాప్ భారత ప్లేయర్లను తీసుకునే విషయంపై ఆయన స్పందించాడు. గైక్వాడ్, జడ్డూ, ధోనీ, శివమ్ దూబే, మతీషా పతిరానా రిటెన్షన్‌లపై నిర్ణయం తీసుకోవడం చాలా సులభమైందన్నాడు. ఈ ఆటగాళ్లను రిటైన్ చేస్తే వేలంలోకి వెళ్లడానికి మాకు తక్కువ పర్సు ఉంటుందని తెలుసని చెప్పుకొచ్చాడు. భారత బెస్ట్ ప్లేయర్స్ కోసం వేలంలో ఇతర జట్లతో పోటీ పడలేమని అభిప్రాయపడ్డాడు.
విశ్వనాథన్ మాటలను చూస్తుంటే పంత్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఆక్షన్ లో తీసుకోవడం కష్టంగా కనిపిస్తుంది. అతనితో పాటు రాహుల్, అయ్యర్ లను దక్కించుకోవడం కూడా అసాధ్యం. చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురిని రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు జడేజాకు 18 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకున్న సీఎస్కే లంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానాకు 13 కోట్లు.. ఆల్ రౌండర్ శివమ్ దూబేకు 12 కోట్లు వెచ్చించింది. ఇక మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ. 4 కోట్ల రూపాయలతో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు. దీంతో మెగా ఆక్షన్ లోకి చెన్నై సూపర్ కింగ్స్ 55 కోట్లతో వెళ్లనుంది. పంత్ దక్కించుకోవాలంటే కనీసం 20 కోట్లు అయినా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తంతో మరొక 20 మందిని కొనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.