ఐపీఎల్ మెగా వేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. ఈ సారి విదేశాల్లో మెగా ఆక్షన్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేసింది. ఫ్రాంచైజీల్లో జోష్ నింపేలా ఆరుగురు ప్లేయర్స్ కు అవకాశమిచ్చింది. దీంతో ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్టు పై కసరత్తు పూర్తి చేసుకుంటున్నాయి. అయితే ఈ సారి మెగావేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్స్ రానుండడంతో ఆసక్తి పెరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసీస్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ను వదిలేసే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అతని కోసం మిగిలిన ఫ్రాంచైజీలు ప్రయత్నించడం ఖాయమైంది. 2021 వేలం సమయంలో ఆర్సీబీ మాక్సీ కోసం 14.5 కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత వరుసగా మూడు సీజన్లలో నిలకడగా రాణించినా… 2024 సీజన్ లో మాత్రం మ్యాక్స్ వెల్ తీవ్రంగా నిరాశపరిచాడు. అయినప్పటకీ ఈ సారి వేలంలో ఫ్రాంచైజీలు అతన్ని దక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి.
మాక్స్ వెల్ కోసం ప్రయత్నించే ఫ్రాంచైజీల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నట్టు సమాచారం. ఆల్ రౌండర్ గా అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని సీఎస్కే యాజమాన్యం భావిస్తోంది. ఆఫ్ స్పిన్ తో పాటు పించ్ హిట్టర్ గా పేరున్న ఈ ఆసీస్ స్టార్ ప్లేయర్ కోసం చెన్నై బిడ్ వేసే అవకాశాలున్నాయి. అలాగే గుజరాత్ టైటాన్స్ కూడా మాక్స్ వెల్ పై కన్నేసింది. హార్థిక్ పాండ్యా ఆ జట్టును వీడిన తర్వాత మరో ఆల్ రౌండర్ కోసం గుజరాత్ ఎదురుచూస్తోంది. ఈ సారి సీజన్ కు మాక్స్ వెల్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్నది గుజరాత్ ఆలోచన. తమ హోంగ్రౌండ్ అతని బ్యాటింగ్ కు సరిగ్గా సరిపోతుందని గుజరాత్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే మాక్స్ వెల్ కోసం ప్రయత్నిస్తున్న జాబితాలో పంజాబ్ కింగ్స్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు స్టార్ ప్లేయర్స్ జట్టులోకి వస్తూ పోతూ ఉన్నా పంజాబ్ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఈ సారి మెగావేలంలో యువ, సీనియర్ స్టార్ ప్లేయర్స్ పైనే ఆ ఫ్రాంచైజీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. దీంతో మాక్స్ వెల్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ జట్టులో ఉండాల్సిందేనని భావిస్తోంది. గతంలో మాక్స్ వెల్ పంజాబ్ కు ఆడాడు. ఆ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతిజింతాతో ఈ ఆసీస్ ఆల్ రౌండర్ కు మంచి సంబంధాలే ఉండడంతో వేలంలో అతన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.