Chicken Price: భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎండాకాలంలో ఈ రేట్లు ఏంటి ?

చికెన్.. ఫుడ్ ఐటమ్ కాదు ఓ ఎమోషన్ అన్నట్లు ఉంటుంది చాలామందికి! నిన్నటివరకు అందుబాటులో ఉన్న కోడి కూర ధరలకు.. ఒక్కసారిగా రెక్కలు వచ్చాయ్. నెల రోజులుగా తగ్గుతున్న రేట్లు.. అమాంతం పెరిగిపోయాయ్. ఓవైపు ఎండలు మండిపోతుండగా.. ఇప్పటికే చాలామంది మాంసానికి దూరం అయ్యారు.

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 04:54 PM IST

డిమాండ్‌ ఉండదు కాబట్టి.. చికెట్ రేట్లు పడిపోతాయని చాలామంది అంచనా వేశారు. నిజానికి గతంలో ఇలానే జరిగింది కూడా. ఐతే విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు మాత్రం అమాంతం రేట్లు పెరిగిపోయాయ్. హైదరాబాద్‌లో నెలరోజుల కింద. చికెన్ ధర కిలో 154 రూపాయలు ఉండేది. వాతావరణ పరిస్థితుల కారణంగా.. ధరలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాయ్.

మే మొదటి వారంలో ఊహించని వర్షాలు.. ఆ తర్వాత విపరీతమైన ఎండలతో చాలా కోళ్లు అనారోగ్యానికి గురయ్యాయ్. దీంతో పౌల్ట్రీ ఉత్పత్తిలో మార్పులు వచ్చాయ్. ఇది తీవ్ర నష్టాన్ని మిగిల్చాయ్. మరోవైపు కోళ్ల దానాలతో పాటు వేరే పదార్థాల ధరలు కూడా పెరగడంతో.. మాంసం రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో విత్ స్కిన్ కిలో చికెన్ 154 రూపాయలు ఉండేది. మే 18నాటికి 213 రూపాయలకు పెరిగింది. అంటే నెలరోజుల్లో దాదాపు 50 రూపాయకు పైగా పెరిగింది.

చికెన్ ధరలు పెరగడంతో.. ఈ మాంసానికి సంబంధించిన ఆహార పదార్థాలు పెరిగే చాన్స్ ఉంది. ఇక కోడి గుడ్డు ఒక్కోటి హోల్ సేల్ రేట్ ప్రకారం నాలుగున్నర రూపాయలు పలుకుతోంది. ఇప్పటికే ఎండవేడితో చాలామంది మాంసానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీటి ధరలు పెరగడంతో.. అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎండాకాలంలోనే రేట్లు ఇలా ఉన్నాయంటే.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటని మాంస ప్రియులు తెగటెన్షన్ పడుతున్నారు.