China Secret Police Stations: మీ ఊళ్లో ఓ పోలీస్ స్టేషన్ ఉంటుంది.. దానికో పరిధి ఉంటుంది. ప్రాంతాలను బట్టి, ప్రజల అవసరాలను బట్టి, అక్కడి జనాభాను బట్టి ప్రభుత్వాలు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు, నేరాలు ఘోరాలను అదుపు చేసేందుకు ప్రజా సంక్షేమం కోసం పోలీసు స్టేషన్లు పనిచేస్తూ ఉంటాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. పోలీసింగ్ వ్యవస్థ ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. చైనాలో కూడా పోలీసింగ్ వ్యవస్థ ఉంది. అయితే అది చైనాకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చైనా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఒక దేశం మరో దేశంలో పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయడమేంటి అనిపిస్తోంది కదూ. కచ్చితంగా తన పరిధిని దాటి ఏదేశమైనా మరో దేశంలో పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయకూడదు. కానీ చైనా చేసేసింది. కుట్రలు, ఆధిపత్య ధోరణలు, విస్తరణ వాదాలకు పెట్టింది పేరైన చైనా.. ఇతర దేశాల్లో అత్యంత రహస్యంగా పోలీస్ వ్యవస్థను నడుపుతోంది. అమెరికా సహా మొత్తం 53 దేశాల్లో చైనా సీక్రెట్‌గా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది.
సీక్రెట్ పోలీస్ స్టేషన్ల వెనుక కథేంటి?
ఇటీవలే న్యూయార్క్ పోలీసులు ఇద్దరు చైనీయులను అరెస్ట్ చేశారు. పైకి వాళ్లిద్దరూ న్యూయార్క్‌లో నివసిస్తున్న సాధారణ చైనా పౌరులలాగే కనిపిస్తారు. కానీ వాళ్లు ఉద్యోగ వ్యాపారాల కోసమో.. చదువుకోవడానికో చైనా నుంచి అమెరికా వెళ్లిన వాళ్లు కారు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తరపున అమెరికాలో సీక్రెట్ పోలీసులుగా పనిచేస్తున్న వ్యక్తులు. ఒక్క అమెరికాలోనే కాదు.. ఇంకా ప్రపంచంలోని అనేక దేశాల్లో చైనా సీక్రెట్ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా తమ ఎజెండాను అమలు చేస్తున్నారు.
చైనా చెప్పేదొకటి.. చేసేదొకటి
ఓవర్‌సీస్ పోలీస్ సర్వీస్ స్టేషన్స్ పేరుతో చైనా వీటిని వివిధ దేశాల్లో ఏర్పాటు చేసింది. అయితే అక్కడున్న ప్రభుత్వాలకు అనుమానం రాకుండా చైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆయా దేశాల్లో ఉంటున్న చైనీయుల అవసరాలను తీర్చేందుకే అవి ఏర్పాటు చేసినట్టు పైకి చెప్పుకుంటారు. అక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి. చైనా డ్రైవర్ల లైసెన్స్ రెన్యువల్‌లో సహాయపడటం, పాస్‌పోర్టు రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తే హెల్ప్ డెస్క్ టైప్‌లో సలహాలు, సూచనలు అందించడం.. ఇలా కాన్సులేట్ తరహా సర్వీసులను అందిస్తూ ఉంటారు. దీంతో చూసేవారికెవరికైనా ఆహా చైనా ప్రభుత్వానికి విదేశాల్లో ఉంటున్న తమ వాళ్లంటే ఎంత ప్రేమో… అనుకుంటారు. అలా అందరూ అనుకునేలా చైనా పాలకులు అన్ని దేశాలను భ్రమల్లో ఉంచుతారు. కానీ తెరవెనుక జరిగేది మాత్రం సీక్రెట్ ఆపరేషన్.
ఇంతకీ సీక్రెట్ పోలీసు స్టేషన్లు ఎందుకు ?
సాధారణ పౌరులైనా.. సామ్రాజ్యాధినేతలైనా కమ్యూనిస్టు పార్టీ విధానాలను ప్రశ్నించినా.. ప్రభుత్వంపై వేలెత్తి చూపినా.. చైనా పాలకులు సహించరు. అవతలి వ్యక్తులు జాక్ మా అయినా ఒకటే.. కామన్ మ్యాన్ అయినా ఒకటే.. ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఏరూపంలో ఉన్నా దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడానికి చైనా ఎంతటి కృూరమైన విధానాలనైనా అవలంభిస్తుంది. విదేశాల్లో ఉంటూ చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న అనుమానం ఉన్న వాళ్లకు బేడీలు వేసేందుకే వివిధ దేశాల్లో చైనా సీక్రెట్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది.
చైనా ఎవరిపై నిఘా పెడుతుంది?
ఇతర దేశాల్లో ఉన్న చైనా ప్రజలు ఏం చేస్తున్నారు. నిజంగా ఉద్యోగం కోసం, చదువుకోసమే వెళ్లారా.. లేక విదేశాల్లో ఉంటూ సొంత దేశంపైనే కుట్రలు చేస్తున్నారా? పాలకపక్షానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులతో చేతులు కలిపారా? ఇలా రకరకాలుగా విదేశాల్లో ఉంటున్న చైనా ప్రజలను అనుమానించి అవమానించి వాళ్లు మళ్లీ స్వదేశం వచ్చేలా బలవంతం చేసి, చైనా చేరుకున్న తర్వాత వాళ్లకు చుక్కలు చూపించడమే చైనా సీక్రెట్ పోలీసు స్టేషన్ల వెనకున్న అసలు కథ.
ఎంతకాలం నుంచి ఇలా సాగుతోంది ?
ఇతర దేశాల్లో ఉన్న తమ పౌరులపై నిఘా పెట్టడం చైనాకు ఇదేమీ కొత్తకాదు. మూడో కంటికి అనుమానం రాకుండా చైనా ఎప్పటి నుంచో ఈ పని చేస్తున్నట్టు అంతర్జాతీయ నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్పెయిన్‌కు చెందిన మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సేఫ్‌గార్డ్ డిఫెండర్స్ లెక్కల ప్రకారం 2016లోనే చైనా ఓవర్‌సీస్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. 53 దేశాల్లో ఇలాంటివి 100కి పైగా సీక్రెట్ పోలీసు స్టేషన్లు ఉన్నట్టు గుర్తించారు. అమెరికా నుంచి అర్జెంటీనా వరకు, యూకే నుంచి వియత్నాం వరకు అన్ని దేశాల్లోనూ చైనా సీక్రెట్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. అయితే మనదేశంలో ఇలాంటి కార్యకలాపాలను నిర్వహిస్తుందా లేదా అన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.
చైనా ఏం చెబుతుంది?
స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఎలాంటి ఆపరేషన్స్ చేపట్టినా దానిని సమర్థించుకునేందుకు చైనా వద్ద ఎప్పుడూ ఓ వాదన సిద్ధంగా ఉంటుంది. సీక్రెట్ పోలీసు స్టేషన్ల విషయంలోనూ చైనా అలాంటి వాదనే చేస్తోంది. ఎవరిపైనా తాము ఎలాంటి నిఘా పెట్టడం లేదని.. సైబర్ క్రైమ్‌కు పాల్పడి చైనా టెలీ కమ్యూనికేషన్ చట్టాలను ఉల్లంఘించిన వారిని మాత్రమే విచారిస్తున్నామని ఆ దేశం చెబుతుంది. కానీ చైనా వాదన అంత నమ్మశక్యంగా లేదనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కంబోడియాలో ఉంటున్న చైనా మహిళ లీకి గతేడాది మార్చిలో చైనా సీక్రెట్ పోలీసుల నుంచి తాఖీదు అందింది. తక్షణం కంబోడియాను వదిలి స్వదేశం వచ్చేయాలని పోలీసులు వర్తమానం పంపించారు. చైనా నిబంధనల ప్రకారం సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువగా నమోదవుతున్న 9 దేశాల్లో చైనా ప్రజలు ఉండటానికి వీల్లేదని.. వెంటనే దేశం వీడాలంటూ పోలీసులు ఒత్తిడి చేశారు.
చైనాలో ఉంటున్న ఆమె తల్లి ఇంటికి హౌస్ ఆఫ్ టెలికాం ఫ్రాడ్ అంటూ బోర్డు కూడా పెట్టారు. తాను ఎలాంటి తప్పూ చేయకపోయినా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. లీ ఒక్కరే కాదు.. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూన్ వరకు చైనా వివిధ దేశాల్లో ఉంటున్న 2లక్షల 30వేల మంది తమ దేశ పౌరులను వివిధ ఆరోపణల కింద వెనక్కి పిలిపించింది. వీళ్లందరిపై ఇప్పటికీ నిఘా కొనసాగుతుంది. 2016లో తమ దేశంలో చైనా పోలీసులతో కలిసి జాయింట్ పెట్రోలింగ్‌కు అంగీకరించిన ఇటలీ.. ఆ తర్వాత చైనా కుట్రలను పసిగట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో న్యూయార్క్ పోలీసులు చైనా సీక్రెట్ పోలీసులను అరెస్ట్ చేయడం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీక్రెట్ పోలీసింగ్ వ్యవస్థ కారణంగా ఇతర దేశాలు కూడా చైనాను నమ్మే పరిస్థితుల్లో లేవు.