Chinese Colleges: ఎక్కడైనా కాలేజీలు విద్యార్థుల్ని చదువుకొమ్మని ప్రోత్సహిస్తుంటాయి. మంచి మార్కులు తెచ్చుకోండి.. ర్యాంకులు తెచ్చుకోండి అని చెబుతాయి. కానీ, చైనాలో (China) మాత్రం కొన్ని కాలేజీలు విద్యార్థుల్ని ప్రేమించుకొమ్మని చెబుతున్నాయి. ఔను! లవ్ (Love) చేసుకొమ్మని విద్యార్థుల్ని కాలేజీలే ఎంకరేజ్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఇందుకోసం కొన్ని కాలేజీలు ఏకంగా సెలవులు (Holidays) కూడా ప్రకటించేశాయి. సెలవుల్లో లవ్ చేసుకుంటూ, రొమాన్స్ (Romance) లో మునిగి తేలుతూ హాయిగా గడపమని సలహా ఇచ్చాయి. అలాగే ప్రకృతిని ఆస్వాదిస్తూ, జీవితపు సారాన్ని అనుభవించండి అని కూడా చెబుతున్నాయి. ఇంతకీ చైనాలో కాలేజీలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయి?
జనాభా తగ్గుదలే కారణమా?
ప్రపంచంలో అత్యదిక జనాభా (Population) కలిగిన దేశం చైనా. అయితే, ఇప్పుడు ఈ విషయంలో చైనాను దాటేయబోతుంది ఇండియా. మన దేశంలో జనాభా పెరుగుదల విపరీతంగా ఉంటే, చైనాలో మాత్రం తగ్గుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. కొన్ని దశాబ్దాలపాటు ప్రపంచ జనాభాలో చైనా నెంబర్ వన్‌గా ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు చేపట్టింది చైనా. దీనిలో భాగంగా 1980-2015 మధ్య కాలంలో వన్ చైల్డ్ పాలసీ (One Child Policy) తీసుకొచ్చింది. అంటే ఏ జంట అయినా.. ఒక్కరికి మించి పిల్లల్ని కనడానికి వీల్లేదు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారికి ప్రభుత్వ పథకాల ద్వారా అందే సాయం రాకుండా చేశారు. దీంతో చాలా మంది ఒక్కరిని మాత్రమే కంటూ వచ్చారు. ఈ కారణంగా దేశంలో జనాభా తగ్గిపోయింది. ఇంకోవైపు చైనాలో పిల్లల పెంపకం ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. విద్య, వైద్యం, ఇతర ఖర్చులు పెరిగిపోయాయి. మరోవైపు ఆదాయం తగ్గిపోయింది. దీంతో పిల్లల్ని పెంచడం కష్టమని భావించి చాలా మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. జనాభా తగ్గుదలకు ఇది కూడా మరో కారణం.
తగ్గిన జననాల రేటు
కొంతకాలంగా భారీ స్థాయిలో జననాల రేటు తగ్గిపోయింది. 60 ఏళ్ల తర్వాత 2021లో జననాల రేటు తక్కువ నమోదైంది. గత ఏడాది ప్రతి వెయ్యి మందికి సగటున 6.77 జననాలు మాత్రమే నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇది 7.52గా ఉంది. కోవిడ్ (Covid) సమయంలో చాలా మంది ఇంటికే పరిమితమైనప్పటికీ పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపలేదని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. పెళ్లి అయిన వారి పిల్లలకు మాత్రమే ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం కూడా అక్కడి వాళ్లు పిల్లల్ని కనకపోవడానికి ఇంకో కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. జననాల రేటు (Birth Rate) తగ్గడం వల్ల చైనాలో జనాభా తగ్గుతోంది. ఈ పరిస్థితి దేశానికి ప్రమాదకరం అని భావించిన ప్రభుత్వం ఈ చట్టాల్లో మార్పులు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రజలు పిల్లల్ని కనేలా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు
జనాభా పెంపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సూచనల ఆధారంగా చైనా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ఉన్న అనేక నిబంధనల్ని ఇప్పుడు చైనా ప్రభుత్వం తొలగిస్తోంది. వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసింది. అంటే ఇకపై చైనాలో ముగ్గురు పిల్లల్ని అయినా కనొచ్చు. ముగ్గురు పిల్లల్ని కంటే వారిలో ఒకరికి ఉచిత విద్య (Free Education) అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే ఇతర సబ్సిడీలు కూడా ఇస్తుంది. అలాగే పెళ్లి కాని జంటల పిల్లలకు కూడా ప్రభుత్వ గుర్తింపు ఇచ్చేందుకు అంగీకరించింది. మహిళలకు పెయిడ్ మెటర్నిటీ లీవ్ (Paid Maternity Leave) ఇవ్వాలని నిర్ణయించింది. మహిళలకు వాళ్లు పని చేస్తున్న కంపెనీ పెయిడ్ లీవ్ ఇవ్వలేకపోయినా, ప్రభుత్వమే పెయిడ్ లీవ్ ఇవ్వనుంది. దీని ప్రకారం ప్రభుత్వమే వారికి డబ్బులు చెల్లిస్తుంది. గర్భ సంబంధిత చికిత్స ఖర్చుల్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది. మగవారికి కూడా పెటర్నిటీ పెయిడ్ లీవ్ ఇవ్వాలనుకుంటోంది.
యువతను ప్రోత్సహించేలా
జనాభా పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల్లో భాగంగా యువతను కూడా ప్రోత్సహించాలనుకుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కాలేజీలు తీసుకున్న నిర్ణయమే సెలవులు. విద్యార్థులకు సెలవులు ఇచ్చి, వాళ్లు ప్రేమలో, రొమాన్స్‌లో మునిగితేలేలా చూడటమే ఈ సెలవుల లక్ష్యం. ప్రకృతితో మమేకమై, జీవితాన్ని ఆస్వాదించడం, నచ్చినట్లు సంతోషంగా గడపడం వంటివి కూడా ఈ సెలవుల ఉద్దేశమే. అయితే, విద్యార్థులు ఈ సెలవులు తీసుకోగానే సరిపోదు.. వాటికి సంబంధించి డైరీ రాయాలి. హోమ్ వర్క్ పూర్తి చేయాలి. వాళ్లు సాధించిన ప్రగతిని తెలియజేయలి. వారి ట్రావెలింగ్‌కు సంబంధించిన విశేషాల్ని వీడియో తీసి అందించాలి. గత నెల నుంచే కాలేజీలు సెలవులు ప్రకటించాయి. ఇప్పటివరకు మొత్తం 9 కాలేజీలు ఇలా సెలవులు ఇచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కొన్ని కాలేజీలు ఈ నెల మొదటివారంలో సెలవులు ప్రకటించాయి. వారం రోజులపాటు ఈ లవ్ హాలీడేస్ ఉంటాయి.