CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ (Chopper) అత్యవసరంగా ల్యాండ్ (emergency landing) అయింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్‌లో సమస్య తలెత్తడంతో హెలికాప్టర్‌ను వెంటనే వెనక్కు మళ్లించారు. దీంతో హెలికాప్టర్‌ను సీఎం కేసీఆర్‌కు చెందిన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. పైలట్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (ASSEMBLY ELECTIONS) నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ అంతా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రతి రోజూ రెండు, మూడు నియోజకవర్గాల పర్యటనలకు వెళ్తున్నారు. ఇందుకోసం హెలికాప్టర్ వాడుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం.. తెలంగాణలోని నాలుగు ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం నుంచి దేవరకద్ర, గద్వాల్, నారాయణ్‌పేట, మక్తల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజాశీర్వాద యాత్రలో పాల్గోనాలి. ముందుగా దేవరకద్ర వెళ్లాలి. ఇందుకోసమే హెలికాప్టర్‌లో బయలుదేరారు. కానీ, కొద్ది సేపటికే సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించారు. వెంటనే హెలికాప్టర్‌ను వెనక్కు మళ్లించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు మరో హెలికాప్టర్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు. దీంతో ఏవియేషన్ సంస్థ మరో హెలికాప్టర్ రెడీ చేసే పనిలో ఉంది. హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పర్యటన తిరిగి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.