పొజిషన్ అయినా.. అపోజిషన్ అయినా.. ప్రత్యర్థి ఎవరైనా సరే.. వన్స్ ఐ స్టెపిన్.. అన్న బాలకృష్ణ సినిమా డైలాగ్‌ని ఆయనకే మరోసారి గుర్తు చేస్తున్నారట హిందూపురంలోని ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఎంపీ సీటుకు పోటీ చేస్తే.. ఆ లెక్కే వేరంటున్నారట. ఈసారి టిక్కెట్ల కేటాయింపుపై టీడీపీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న టైంలో బాలకృష్ణ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వైపు చూస్తే బాగుంటుందన్నది వారి అభిప్రాయంగా చెబుతున్నారు. అలా ఎందుకంటే ఆ లెక్క కూడా పక్కాగానే ఉంది.. 2019 జగన్ వేవ్‌లో హిందూపురంలో తొడ గొట్టారు బాలయ్య. ఇంకా చెప్పాలంటే.. 2014 కంటే మెజార్టీ పెరిగింది. అలాంటి వ్యక్తి లోక్‌సభ సీటుకు పోటీ చేస్తే.. ఆ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలపై ప్రభావం ఉంటుందన్న ఆలోచన టిడిపి కేడర్‌లో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ ఇమేజ్‌ని వీలైనంతగా వాడుకోవాలనీ.. అందుకే ఆయన్ని లోక్‌సభ బరిలో దింపాలన్నది లోకల్ కేడర్ మనసులో మాటగా చెబుతున్నారు.
హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ.. 2019 ఎన్నికల్లో కొత్తగా కుల సమీకరణలతో ఆ కోటను బద్దలు కొట్టింది వైసీపీ. ఈ నియోజకవర్గం పరిధిలో కురుబ సామాజిక వర్గం ఎక్కువ అందుకే.. అదే సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌ని బరిలో దింపి సక్సెస్ అయింది వైసీపీ. అది బాగా వర్కవుట్ అవడమే కాకుండా.. ఆ ప్రభావం మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా పడింది. ఇప్పుడు అదే క్యాస్ట్ ఈక్వేషన్‌ని మరో కోణంలో ఆలోచించి ఈసారి కొత్త అభ్యర్థిని తెర మీదికి తీసుకువచ్చారు సీఎం జగన్. ఇక్కడ కురుబలతో పాటు బోయ సామాజిక వర్గం కూడా బలంగానే ఉంది. ఆ క్రమంలో ఒకసారి కురుబలకు అవకాశం ఇచ్చారు ఈసారి బోయలకు ఇవ్వాలన్న యాంగిల్‌లో శాంతమ్మ పేరును ఫైనల్ చేసింది వైసీపీ. బళ్ళారికి చెందిన గాలి జనార్ధనరెడ్డి సన్నిహితుడు శ్రీరాములు సోదరి శాంతమ్మ..
గతంలో బీజేపీ ఎంపీగా పనిచేశారు. కానీ.. ఇప్పుడు టిక్కెట్ ఫైనల్ అయ్యాక ఒక్కరోజులోనే ఆమె బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. అదేరోజు ఆమెను హిందూపురం అభ్యర్థిగా కూడా ప్రకటించారు. టీడీపీ కూడా మొదట కురుబ సామాజిక వర్గానికే ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని అనుకున్నా.. వాళ్ళ వ్యూహం మారింది కాబట్టి.. తాము కూడా మార్చుకునే ప్రయత్నంలో ఉందట. సైకిల్ పార్టీ ఇప్పుడు బోయ అభ్యర్థుల కోసం చూస్తున్నట్టు తెలిసింది. అదే సమయంలో స్థానిక పార్టీ నాయకులకు మరో ఆలోచన వచ్చింది. అసలు బాలయ్యని బరిలో దింపితే ఆయన ఇమేజ్ ముందు ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ పెద్దగా పనిచేయవన్నది వాళ్ళ ఆలోచనగా తెలిసింది. హిందూపురం పార్లమెంటు పరిధిలో టిడిపి బలంగా ఉండటం, బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిసి వస్తాయని లెక్కలేస్తున్నారట. ఈ అభిప్రాయాలను పార్టీ అధినాయకత్వం ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో తెలియదుగానీ.. అదే నిజమైతే మాత్రం వైసీపీ ఊహించని వ్యూహం అవుతుందంటున్నారు పరిశీలకులు. మరి బాలయ్య హ్యాట్రిక్ కోసం అసెంబ్లీ వైపే మొగ్గుతారా.. లేక చూస్తా.. రెండో వైపూ చూస్తా.. అంటారా అన్నది మనమూ చూడాలన్నది రాజకీయ విశ్లేషకుల మాట.