100 దేశాలు నిషేధించాయి.. అయినా ఉక్రెయిన్ చేతికి క్లస్టర్ బాంబులు

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి పశ్చిమ దేశాలతో కలిసి జెలెన్‌స్కీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతిస్తున్న అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 06:45 PM IST

ఉక్రెయిన్ అలా కోరిందో లేదో బైడెన్ ప్రభుత్వం ఆ దేశానికి క్లస్టర్ బాంబులను ఇచ్చేందుకు అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇవాళ్టి వరకు అమెరికా తమ అమ్ముల పొదిలో ఉన్న ఎన్నో రకాల ఆయుధాలను ఉక్రెయిన్ పంపించింది. ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్‌ల నుంచి ఎక్స్‌ప్లోజివ్ డ్రోన్ల వరకు తమ వద్ద ఉన్న అత్యాధునిక మిలటరీ ఆయుధాలను ఉక్రెయిన్‌కు చేరవేసింది. ఉక్రెయిన్ నాటోలో భాగస్వామ్యం కాదుకాబట్టి.. పరోక్షణంగా అమెరికా సహా పశ్చిమ దేశాలు ఏదో ఒకరూపంలో ఉక్రెయిన్ మిలటరీకి ఆయుధాలు అందిస్తున్నాయి. అయితే రష్యాపై కౌంటర్ అఫెన్సివ్‌ను సమర్థవంతంగా అమలు చేయడంలో తప్పటడుగులు వేస్తున్న ఉక్రెయిన్ అమెరికా ముందు ఓ ప్రతిపాదన ఉంచింది. తమ దేశానికి ఉన్నపళంగా క్లస్టర్ బాంబులను పంపించాలని కోరింది. దీంతో బైడెన్ కూడా అడిగిందే తడవుగా జెలెన్‌స్కీ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో క్లస్టర్ బాంబులను పంపుతున్నట్టు ప్రకటించారు.

ప్రపంచం మొత్తుకుంటున్నా అమెరికా వినదా ?
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కి పైగా దేశాలు క్లస్టర్ బాంబులపై నిషేధం విధించాయి. వీటిని వాడటం వల్ల తలెత్తే పర్యావాసాలను గుర్తించిన దేశాలు క్లస్టర్ బాంబులపై నిషేధం విధించాయి. ఒకరకంగా ఇవి న్యూక్లియర్ బాంబుల కంటే ప్రమాదకరమైనవిగా భావిస్తున్నారు. వీటిని సైలెంట్ క్లిల్లర్స్‌గా కూడా చెబుతారు. క్లస్టర్ బాంబుల వాడకాన్ని వ్యతిరేకిస్తూ 123 దేశాలు ఎప్పుడో అంతర్జాతీయ ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి. బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, స్పెయిన్, ఇటలీ ఇలా అనేక దేశాలు క్లస్టర్ బాంబుల జోలికి వెళ్లడం లేదు. అయితే వీటి ప్రమాద తీవ్రత తెలిసినా సరే అమెరికా మాత్రం తమ అమ్ములపొదిలో నుంచి వీటిని ఉక్రెయిన్‌ పంపిస్తోంది.

అసలు క్లస్టర్ బాంబ్ అంటే ఏంటి ?
మిగతా బాంబులకు క్లస్టర్ బాంబులకు చాలా తేడా ఉంది. వీటిని జారవిడిన ప్రదేశంలో ప్రభావం వెంటనే కాకుండా కొన్ని సంవత్సరాలు.. అప్పుడప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత కూడా ఉంటుంది. చిన్న చిన్న బాంబులన్నింటినీ కలిపి రాకెట్ ద్వారా లేదా మిస్సైల్ ద్వారా ఒక పెద్ద ఏరియాలోకి జారవిడుస్తారు. వీటిలో క్లస్టర్ బాంబ్స్ అంటారు. ఎక్కడైతే వీటిని ప్రయోగిస్తారో.. అక్కడ వీటిలో కొన్ని బాంబులు వెంటనే పేలి విధ్వంసం సృష్టిస్తాయి. కొన్ని బాంబులు మాత్రం అలానే ఉండిపోతాయి. తర్వాత కాలంలో ఇవి ఎప్పుడు పేలతాయో ఎవరూ ఊహించలేరు. కానీ కాలం గడిచే కొద్దీ ఇవి ప్రమాదకరంగా మారి ఏదో ఒక రోజు కచ్చితంగా విధ్వంసం సృష్టిస్తాయి. పెద్ద స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పుడు.. ప్రత్యర్థి సైన్యంపై బాంబుల వర్షం కురిపించడానికి క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తారు. ఇవి ఎక్కడైతే పడతాయో అక్కడ భారీ స్థాయిలో విధ్వంసం జరుగుతుంది. సైనికులు మరణిస్తారు. మిలటరీ ఆయుధాలు పనికిరాకుండా పోతాయి.

క్లస్టర్ బాంబులపై నిషేధం ఎందుకు ?
ప్రపంచంలోని అన్ని దేశాలు అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో క్లస్టర్ బాంబులను వందకు పైగా దేశాలు నిషేధించడానికి బలమైన కారణాలే ఉన్నాయి. వీటిని ప్రయోగించిన తర్వాత వీటిలో ఉండే బాంబ్‌లెట్స్ కొన్ని పేలకుండా ఇంకా సజీవంగానే ఉంటాయి. జనసాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ప్రయోగిస్తే పిల్లల చేతికి చిక్కే ప్రమాదముంది. ఈ బాంబ్‌లెట్స్ అన్నీ చూడటానికి పిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉంటాయి. సామాన్య ప్రజలు, చిన్నారులు తెలిసీ తెలియక ఈ బాంబులను ముట్టుకుని ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అందుకే మెజార్టీ దేశాలు ఈ బాంబులను వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా క్లస్టర్ బాంబుల వినియోగంపై ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

నిషేధం ఉన్నా వాడుతున్నదెవరు ?
అమెరికా ద్వంద్వ విధానాలు ఎలా ఉంటాయో క్లస్టర్ బాంబుల విషయంలో ఆ దేశం అనుసరిస్తున్న పాలసీని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. గతంలో క్లస్టర్ బాంబులను విపరీతంగా ఉపయోగించారంటూ రష్యాపై అమెరికా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. క్లస్టర్ బాంబుల ద్వారా సామాన్యుల ప్రాణాలు తోడేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే అమెరికా.. రష్యాకు ప్రత్యర్థిగా ఉన్న ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులను సరఫరా చేస్తోంది. ఇదీ అమెరికా విదేశాంగ నీతి. అటు రష్యా కూడా ఉక్రెయిన్ పై దండయాత్ర చేపట్టినప్పటి నుంచి క్లస్టర్ బాంబులను వాడుతూనే ఉంది.

ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబుల అవసరమేంటి ?
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 500 రోజులు దాటిపోయింది. రెండు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను కోల్పోయాయి. దాడులు, ప్రతిదాడులతో సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ బీభత్సం కొనసాగుతూనే ఉంది. అయితే రష్యాతో పోల్చితే ఉక్రెయిన్ ఆయుధ సంపత్తి చాలా తక్కువ. అందుకే ఉక్రెయిన్ నాటో దేశాలపై ఆధారపడుతోంది. గతేడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ తమకు మద్దతిచ్చే దేశాల నుంచి ఆయుధాలను తెప్పించుకుంటోంది. అప్పటి నుంచే క్లస్టర్ బాంబులను కూడా వాడుతోంది. యుద్ధంలో నష్టం ఏ స్థాయిలో ఉన్నా రష్యా వేగంగా ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అయితే పశ్చిమదేశాల నుంచి ఉక్రెయిన్ కు అదే వేగంతో ఆయుధాలు అందటం లేదు. ప్రత్యర్థి శిబిరాలను నేలకూల్చాలన్నా.. దాడులు చేయాలన్నా.. క్లస్టర్ బాంబుల తరహా ఆయుధాలు చాలా అవసరం. ఆయుధ నిల్వలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. రష్యాతో ఉక్రెయిన్ దాదాపు 1000 కి.మీ పొడవైన యుద్ధక్షేత్రంలో తలపడుతోంది. ఆయుధాలను సమకూర్చుకోవడం ఆలస్యమయ్యే కొద్దీ రష్యా విజృంభిస్తుంది. అందుకే అత్యవసరంగా క్లస్టర్ బాంబులను పంపాలని ఉక్రెయిన్ అమెరికాను కోరింది.

అమెరికా నిర్ణయం ప్రభావమెంత ?
క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్‌కు సరఫరా చేయాలన్న అమెరికా నిర్ణయం ఆదేశ హిమోక్రసీని బయటపెట్టింది. అమెరికా మిత్ర దేశాలు కూడా ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం క్లస్టర్ బాంబులను పంపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. త్వరలోనే జరగనున్న నాటో సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశముంది. అమెరికా చర్య నాటో చీలకకు దారితీయొచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.