రైతులు, మహిళలు, యువతను టార్గెట్ చేస్తూ చంద్రబాబు వరాలు గుప్పించారు. మేనిఫెస్టో మీద జనాలు ఏమనుకుంటున్నారన్న సంగతి పక్కన పెడితే.. ఈ మేనిఫెస్టో ఎన్నికల మీద ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ మేనిఫెస్టోతో అలర్ట్ అయిన జగన్.. కీలక ఓటు బ్యాంక్ చేతుల్లోంచి జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయాలు చూస్తే అదే నిజం అనిపిస్తోంది కూడా ! విపక్షాలు అన్నీ ఏకమై కలిసొచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని.. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని జగన్ ధీమాతో కనిపిస్తున్నారు.
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో సగానికి పైగా.. ప్రభుత్వం నుంచి ఏదో ఒక పథకం రూపంలో లబ్ధి పొందారని.. వాళ్లంతా వైసీపీ వైపే ఉంటారన్నది జగన్ లెక్క. ఐతే టీడీపీ మేనిఫెస్టో ప్రకటన తర్వాత.. జగన్ మరింత జోష్ పెంచారు. 2024 ఎన్నికలకు సూపర్ ప్లాన్ సిద్ధం చేశారు. లబ్ధిదారులను పెరిగేలా చేయడమే లక్ష్యంగా.. త్వరలో సంక్షేమ చక్ర పేరుతో డోర్ డోర్ టు సర్వేను ప్రారంభించబోతున్నారు. ఎన్నికల సమయం కావడంతో.. ఉద్యోగులను కూడా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. పెన్షన్, ఆన్‌లైన్ అటెండెన్స్‌లాంటి వ్యవహారాల్లో జగన్‌పై ఉద్యోగులు కాస్త సీరియస్‌గా ఉన్నారు. వారిని కూడా కూల్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఉద్యోగులకు అనుకూలంగా కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా హ్యాపీగానే కనిపించాయ్. ఇలా కోపంగా ఉన్న ఉద్యోగులను తమ వైపు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇక అటు మహిళా ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునే దిశగా కూడా పనులు స్పీడప్ చేశారు. ఇప్పటికే మహిళల కోసం చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. 30 లక్షల ఇళ్లు అందించడం ద్వారా ఓటు బ్యాంకును కోల్పోకుండా చూసుకుంటోంది.
ఈ నెల 28న అమ్మ ఒడి నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. 44 లక్షల మంది మహిళల ఖాతాల్లో 15 వేల చొప్పున నగదును ప్రభుత్వం జమ చేయనుంది. ఇలా ప్రధాన ఓటు బ్యాంక్‌ను సీఎం జగన్ కాపాడుకుంటూ వస్తున్నారు. ఏ ఓటు బ్యాంక్‌ను టార్గెట్ చేసి టీడీపీ వ్యూహాలు రచిస్తుందో.. అదే ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు జగన్ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. పక్కా వ్యూహంతో 2024 ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. జగన్ ప్లాన్ చూసి.. అదరహో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.