CM Jagan: 30మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు నో టికెట్‌.. జగన్‌ ఎవరి మీద వేటు వేయబోతున్నారు ?

అదేదో రేపే ఎన్నికలు అన్నట్లు కనిపిస్తోంది ఏపీలో పొలిటికల్ సీన్ ! ఒకరికి మించి ఒకరు.. ఒకరి తర్వాత ఒకరు.. వ్యూహాలతో అంతకుమించి అనిపిస్తున్నారు. క్లీన్‌స్వీప్ టార్గెట్ అని జగన్ అంటుంటే.. పులివెందులలో జగన్ ఓడిస్తామని టీడీపీ సవాల్ విసురుతోంది.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 04:10 PM IST

దీంతో ఎన్నికలకు ఏడాది ముందే పొలిటికల్‌ వాతావరణం.. రసవత్తరంగా మారింది ఏపీలో ! నెగ్గడానికి ఎన్నిసార్లు తగ్గేందుకు అయినా.. ఎక్కడ తగ్గేందుకు అయినా సిద్ధం అన్నట్లుగా కనిపిస్తున్నాయ్ రెండు పార్టీలు. దీనికోసం కఠిన నిర్ణయాలకు సిద్ధం అవుతున్నాయ్. జనాల్లో వ్యతిరేకత ఉంది అనుకుంటే.. ఎవరైనా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే పక్కనపెట్టేందుకు, పక్కకు తప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయ్. టీడీపీ సంగతి ఎలా ఉన్నా.. వైసీపీలో మాత్రం రెండాకులు ఎక్కువే అన్నట్లుగా తయారయింది పరిస్థితి.

సంక్షేమ పథకాల మీద, ఎమ్మెల్యేల పనితీరు మీద.. జనాల అభిప్రాయాల మీద ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న జగన్‌.. వచ్చే ఎన్నికలకు కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పని చేయని ఎమ్మెల్యేలను, జనాల్లో వ్యతిరేకత ఉన్న వారిని పక్క పెట్టేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఈ లిస్టులో దాదాపు 30మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లందరికీ టికెట్ దాదాపు అనుమానమే ! ప్రజాప్రతినిధులంతా జనాల్లోనే ఉండేలా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జగన్‌. గడపగడపకు కార్యక్రమం అయినా.. జగనన్న స్టిక్కర్లు అయినా.. నిన్నటికి నిన్న జగనన్నకు చెబుదాం కార్యక్రమం.. జనాలకు చేరువ కావడంతో పాటు.. నేతల పనితీరు అంచనా వేయడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

జనాలు ఎవరి మీద ఎక్కువ ఫిర్యాదులు చేస్తున్నారు.. ఏ నియోజకవర్గం నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్న డేటా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటికితోడు ప్రశాంత్ కిషోర్‌ టీమ్ ఎప్పటికప్పుడు సర్వేలు చేసి.. రిపోర్టులు జగన్‌కు అందిస్తోంది. ఓవరాల్‌గా 30మంది ఎమ్మెల్యేల పనితీరుపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్‌కు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. వీళ్లందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ అనుమానమే అన్న చర్చ జరుగుతోంది. అందరూ మనవాళ్లే.. అందరికీ అవకాశం అని జగన్ మాట్లాడుతున్నా.. అవి ఇప్పటి మాటలు మాత్రమేనని.. అసలు నిర్ణయం ఎన్నికల సమయంలో చూడడం ఖాయం అని తెలుస్తోంది.

నిజానికి గడపగడపకు కార్యక్రమం సమయంలోనే.. 30మంది ఎమ్మెల్యేల తీరుపై జగన్ ఫైర్ అయ్యారు. ఆ లిస్టులో గ్రంధి శ్రీనివాస్, సుచరిత, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, ఉదయభాను, కొడాలి నాని, వసంత కృష్ణ ప్రసాద్ పేర్లు కూడా వినిపించాయ్. మరి ఇప్పుడు లిస్టులో నుంచి వెళ్లిందెవరు.. కొత్తగా వచ్చి చేరింది ఎవరని.. వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ కనిపిస్తోంది.