CM Jagan: 18 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్‌.. ఇంతకీ ఎవరు వాళ్లు.. సీటు డౌటేనా ?

ఎన్నికలకు అటు ఇటుగా.. ఇంకా ఏడాది సమయం ఉన్నా.. ఏపీ రాజకీయం ఇప్పటి నుంచే భగ్గుమంటోంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారం నిలబెట్టుకొని తీరాలని.. జగన్ కసి మీద కనిపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 05:56 PM IST

జాలి పడ్డాల్లేవ్.. జాగ్రత్తపడ్డాలు తప్ప అన్నట్లుగా నేతలకు సూచిస్తున్నారు. పనితీరు బాగోలేని నేతలు.. పంథా మార్చుకోకపోతే తీసి పక్కనపెట్టేయడానికి రెండో ఆలోచన కూడా ఉండదని పదే పదే చెప్తున్నారు అందుకే ! గెలవడం కాదు.. క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలని సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు వాళ్లకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలతో పలుమార్లు మీటింగ్‌లు నిర్వహించిన సీఎం.. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. పని చేయకపోతే టికెట్‌ ఇచ్చేది లేదంటూ క్లియర్‌ కట్‌గా చెప్పేశారు.

ఇప్పటి నుంచి ప్రతీ రోజు జనాల మధ్యే ఉండాలంటూ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని సూచించారు. జూన్ 23 తేది నుండి చేపట్టనున్న జగనన్న సురక్ష కార్యక్రమం కార్యాచరణపై ప్రధానంగా దిశానిర్దేశించారు. సురక్ష కార్యక్రమంలో బాగంగా ప్రతీ ఇంటికి వెళ్ళాలని.. ఏ ఏ పథకాలు జనాలకు అందలేదో తెలుసుకోవాలని ఆదేశించారు. జగన్ అన్న సురక్ష కార్యక్రమం కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని.. యాప్ లో 11 అంశాలు ఉంటాయని.. ఈ 11 అంశాలల వారీగా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని ఆదేశించారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. చివరలో 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు జగన్ వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం.. ఇప్పటికి కూడా తీరు మార్చుకోకపోతే తీసేయడం తప్ప వేరే మార్గం లేదు అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఎమ్మెల్యేలకు ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం ఇదేం మొదటిసారి కాదు. గడపగడపకు కార్యక్రమంపై జరిగిన మొదటి రివ్యూ మీటింగ్‌లోనే జగన్ ఇలాంటి హెచ్చరికలు చేశారు. మంత్రులు విడదల రజినీ, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్‌తో సహా.. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి.. ఇలా 32మంది అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు జగన్. ఐతే ఇప్పుడు ఆ నంబర్ 18కు తగ్గింది. అంటే మిగతా 14మంది పనితీరు మార్చుకున్నారన్న మాట. ఆ 18మంది పేర్లు ప్రస్తావించకపోయినా.. ఇదే లాస్ట్ చాన్స్ అన్నట్లుగా జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఎమ్మెల్యేలను టెన్షన్ పట్టుకుందట. ఆ 18మంది నేతలు జనాల్లోకి పరుగులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారని టాక్.