సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ ఆలీకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనిపించుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరపున ఏదో ఒక నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే సీట్లపై ఆయన నజర్ పెట్టారు. అదీ కుదరకపోతే.. కనీసం రాజ్యసభ ద్వారా అయినా సరే.. పార్లమెంట్ లోకి అడుగు పెట్టాలని అలీ భావిస్తున్నారు. గతంలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయినా అప్పడు అవకాశం దక్కలేదు. ఈసారైనా వైసీపీ చీఫ్ జగన్ తనను పార్లమెంట్ కు పంపుతారా అనిఆలీ ఎదురు చూస్తున్నారు.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున నటుడు ఆలీ విస్తృతంగా ప్రచారం చేశారు. ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేయడం వైసీపీకి బాగానే కలిసొచ్చింది. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఆయన్ని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా నియమించారు. ఆలీ కుమార్తె పెళ్ళికి కూడా జగన్ వెళ్ళి వధూవరులను ఆశీర్వించారు. ఈమధ్య జరిగిన వైసీపీ సామాజిక సాధికారత సభల్లో పాల్గొన్న ఆలీ.. ప్రభుత్వాన్ని, జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎంపీగా పోటీ చేయాలని ఆలీ భావిస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. అయితే అక్కడ ఇప్పటికే అంబటి రాయుడికి టిక్కెట్ కన్ఫమ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే కర్నూలు జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై ఆలీ దృష్టి పెట్టారు. కర్నూలు లేదా నంద్యాల లోక్ సభ నియోజకవర్గాల్లోనూ ముస్లింల ఓట్ల సంఖ్య ఎక్కువే. వాటిల్లో ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేయాలని అలీ భావిస్తున్నారు. జగన్ తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే ఓకే. లేదంటే కనీసం రాజ్యసభ సీటు అయినా ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఆలీ.
గతంలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడే అలీకీ ఛాన్స్ ఉంటుందని అనుకున్నారు. కానీ అప్పట్లో బీసీ నేతలైన ఆర్. క్రిష్ణయ్య, బీద మస్తాన్ రావుని పెద్దల సభకు పంపారు. విజయ్ సాయి రెడ్డికి ఎక్స్ టెన్షన్ కల్పించారు. ఏప్రిల్ లో ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మార్చిలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించే ఛాన్సుంది. అందుకే ఈ మూడింటిలో ఒకటి ఆలీకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు వైసీపీ లీడర్లు. లోక్ సభ టిక్కెట్ ఇస్తే.. ప్రత్యక్షంగా లేదంటే రాజ్యసభ సీటు ద్వారా పరోక్షంగా.. ఎలాగైనా సరే.. పార్లమెంట్ సభ్యుడిని అనిపించుకోవాలని నటుడు ఆలీ ఆశిస్తున్నారు. మరి జగన్ ఆలోచన ఎలా ఉంది. ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా లోక్ సభ టిక్కెట్ ఇస్తారా.. రాజ్యసభకు పంపుతారా అన్నది తొందర్లోనే తేలనుంది.