CM kcr: బీఆర్ఎస్ మరోసారి అధికారం కోసం కేసీఆర్ వేసిన వ్యూహాలు ఇవేనా..

ముచ్చటగా మూడోసారి అధికారమే లక్ష్యంగా చాణుక్య వ్యూహాలతో దూసుకుపోతున్న కేసీఆర్. ప్రత్యర్థులనే కాదు తన పార్టీ అభ్యర్థులతోనూ రాజకీయ క్రీడ ఆడుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 01:46 PM IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన మొదలు నేటి వరకూ సీఎం కేసీఆర్ ఏకఛత్రాదిపత్యం వహిస్తున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులను ముందే అంచనా వేసి ఈ సారి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నా అంటూ ప్రకటించారు. దీంతో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ ఒక్క నియోజకవర్గంతో రాష్ట్రం మొత్తం అలర్ట్ చేసి మరోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలన్నది కేసీఆర్ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న వాదన. అందుకే ఎన్నికలకు మూడు నెలల ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు.

115 మంది అభ్యర్థుల ప్రకటన అందుకేనా..

ప్రస్తుతం 115 స్థానాలకు ఎమ్మెల్యేలను ప్రకటించారు. వీరిలో కొందరు తమతమ నియోజకవర్గాల్లో సందడి చేస్తూ ఆనందంతో ఊగిపోతున్నారు. ఈ ఆనందం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ‎ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. పైగా ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ కూడా వెలువడలేదు. దీంతో క్రింది స్థాయిలో పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారు. ప్రజల్లో వీరికిపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అనే అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇలా చేపట్టిన సర్వేలో అభ్యర్థుల పై వ్యతిరేకత వస్తే అప్పుడు తప్పకుండా అతని టికెట్ చిరిగిపోయే ప్రమాదం ఉంది. అప్పటికే పుణ్యకాలం అంతా కరిగిపోతుంది. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అప్పుడు ప్రజల మద్దతు ఎవరికి ఉందో మరో సర్వే చేపట్టి అతనిని బీఆర్ఎస్ లోకి లాక్కొని పార్టీ బలం, అతని స్థానిక అనుకూలతను బీఆర్ఎస్ గెలుపు కోసం ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కామారెడ్డి నుంచి పోటీ వెనక అసలు కథ

కామా రెడ్డినుంచి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే అతనికి ఢీ కొట్టేందుకు బరిలో దిగినట్లు తెలుస్తుంది. ఒక వేళ షబ్బీర్ అలీ కేసీఆర్ తో ఢీ కొనలేరు.. ఓడిపోతారు అనే సంకేతాలు వస్తే అతనిని అక్కడి నుంచి కాంగ్రెస్ తప్పించే ప్రయత్నం చేస్తే దానికి కూడా కేసీఆర్ అడ్వాంటేజ్ గా మార్చుకుంటారు. సీఎం కేసీఆర్ నిలబడినందుకే గెలిచే సత్తా లేకుండా నియోజకవర్గాన్ని మార్చుకున్నారు అని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవాచేసే అవకాశం ఉంది. అందుకే కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వారి గ్రౌండ్ వర్క్ ఏమాత్రం చేసుకుంటారు. కాంగ్రెస్ ఇప్పుడు ఏరకమైన వ్యూహాలను అవలంభిస్తుందో క్షుణ్ణంగా పరిశీలించి అవసరం అయితే పోటీ చేస్తారు. లేకుంటే చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు రాజకీయ పండితుల వాదన. ఇలా బలమైన అభ్యర్థులను రాజకీయంగా చెక్ పెడుతూ అధికార పీఠాన్ని అధిరోహించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.

బీఆర్ఎస్ నుంచి జంప్ కాకుండా చెక్

ఒకవేళ ఇప్పుడు చాలా మంది అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి టికెట్ ఇవ్వకుండా ఉంటే వారు బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. దీని ప్రభావం పార్టీపై తీవ్రంగా పడే ప్రమాదం ఉంది. ముందుగానే బీఆర్ఎస్ పై కొంత వ్యతిరేకత ఉన్నట్లు కొన్ని సర్వేలో వెల్లడైంది. ఈ సమయంలో సమయస్పూర్తితో వ్యవహరించకుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఎదురవుతుందని అంచనావేశారు. పార్టీపై వ్యతిరేకత, నాయకుల టికెట్ ఇవ్వని ఆగ్రహం రెండూ కలిసి వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపుతుంది. పైగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వారిని చేర్చుకునేందుకు సిద్దంగా ఉంది. అందుకే గతంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మొదటి లిస్ట్ లో 60 మందిని ప్రకటించు అని చాలా సార్లు అన్నారు. దీనికి కారణం అసమ్మతితో, టికెట్ రాకుండా ఆగ్రహంతో ఉన్న వారిని కాంగ్రెస్ లో లాక్కొని బీఆర్ఎస్, కేసీఆర్ పై దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేయాలని భావించారు. ఇలాంటి ఆలోచనలకు చెక్ పెడుతూ కేసీఆర్ 115 మందిని ప్రకటించి అందరికీ షాక్ కి గురిచేశారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ, బీఫాం ఇచ్చే వరకూ ప్రస్తుతం ఉన్న నాయకులతో బీఆర్ఎస్ కి అనుకూలంగా పనిచేయించుకుని చివరి నిమిషంలో వ్యతిరేకత ఉంటే వారిని లిస్ట్ లో నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎటూ పోలేని పరిస్థితిని తీసుకొచ్చి ఉంటే తన దగ్గరే ఉండాలి.. ఒక వేళ పక్క పార్టీ తీర్థం పుచ్చుకుంటే విజయావకాశాలు లేకుండా ఓటమి చవిచూడాలి అని పన్నగం వేశారు.

ఇలా అన్ని దారులను మూసేసి మూడోసారి అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ కు తిరుగులేదు అని చూపేందుకు కేసీఆర్ ఉన్నారు. అందుకే అన్ని రకాలా రాజకీయ వ్యూహాలను వండి వారుస్తున్నారు.

T.V.SRIKAR