KCR SPEECH : కాంగ్రెస్ వల్లే తెలంగాణ పదేళ్ళు ఆలస్యం… నా వల్లే రాష్ట్రం వచ్చింది : సీఎం కేసీఆర్

" నేను ఆమరణ దీక్ష చేస్తేనే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ వల్లే 10యేళ్ళు తెలంగాణ ఆలస్యమైంది... ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు సీఎం కేసీఆర్ ’

  • Written By:
  • Updated On - November 13, 2023 / 06:28 PM IST

KCR Speech: తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసిందని సీఎం కేసీఆర్ (KCR) ఆరోపించారు 2004లోనే రావాల్సిన ప్రత్యేక తెలంగాణ పదేళ్లు ఆలస్యంగా 2014లో ఇచ్చారని అన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యే దాకా జనం వలసలు వెళ్ళే వారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).
కాంగ్రెస్ (Congress) వస్తే రైతు బంధు దుబారా అని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని అన్నారు. రైతు బంధు రావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తాము 24 గంటల కరెంట్ ఇస్తే… కాంగ్రెస్ పార్టీ 3 గంటలు చాలు అంటోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటలు కరెంట్‌ ఇవ్వడం లేదని అన్నారు.
కాంగ్రెస్ కి అధికారం ఇస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్‌ వస్తే ధరణిని (Dharani) తీసేస్తారు. ధరణితో ఇప్పుడు రైతులు ఇబ్బందులు లేకుండా ఉన్నారనీ, దానివల్లే రైతుబంధు (Rythu Bandhu) డబ్బులను మీ బ్యాంక్ అకౌంట్స్ కి డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి పంపుతున్నాం. ధాన్యం కొనుగోళ్ళు, రైతు బీమా పథకాలు కూడా ధరణి వల్లే వస్తున్నాయి. ధరణి తీసేస్తే మీకు డబ్బులు ఎలా వస్తాయని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణిపోతే రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాలి. నీకు వచ్చే డబ్బుల్లో సగంపైనే అధికారులే లంచంగా తీసుకుంటారని ఆరోపించారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుంది అని కేసీఆర్ (KCR) అన్నారు. బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లేయాలని కేసీఆర్ కోరారు.