CM KCR: సీఎం కేసీఆర్ ఈటల జపం వెనక అసలు కారణం ఇదేనా?

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పదేపదే ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈటలతో కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - February 13, 2023 / 05:52 PM IST

కేసీఆర్ రాజకీయం అర్థం కావాలంటే.. అవతలి వైపు కూడా కేసీఆరే అయి ఉండాలని పాలిటిక్స్‌లో ఓ మాట ఉంది. ఎప్పుడో జరగబోయే పనికి.. ఇప్పటి నుంచే అడుగులు వేస్తుంటారు. ప్రత్యర్థి పార్టీ ఊహలకు కూడా అందనంత దూరంలో ఉంటారు. అలాంటి కేసీఆర్‌.. అసెబ్లీలో పదేపదే ఈటల ప్రస్తావన తీసుకురావడం కొత్త చర్చకు దారి తీస్తోంది. బీఆర్ఎస్‌ను వీడిన తర్వాత బీజేపీ నుంచి గెలిచి అసెంబ్లీకి ఈటల అడుగు పెట్టే సమయంలో ఆయనను కలవడం కూడా ఇష్టం లేదు అన్నట్లు కనిపించిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం మిత్రమా ఈటల, ఈటలకు అన్నీ తెలుసు అంటూ పదేపదే.. 18సార్లు మాట్లాడడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కేసీఆర్‌… ఇప్పుడు ఈటల పేరును ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించినట్లు.. దీని వెనక వ్యూహం ఉందా.. భారీ మైండ్ గేమ్ ఉందా అనే చర్చ వినిపిస్తోంది. ఐతే అదే నిజం అనే మాటలు వినిపిస్తున్నాయ్ ఇప్పుడు !

ఈటల మాటను పదేపదే తెరమీదకు తీసుకురావడం వెనక.. మైండ్ గేమ్ దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల.. ఆ పార్టీలో ప్రస్తుతం చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన పదే పదే చెప్తున్నారు. కేసీఆర్ మీద పోటీకి సిద్ధం అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలతో ఈటల టచ్‌లో ఉన్నారనే గుసగసులు వినిపిస్తున్నాయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ విషయమై బీఆర్ఎస్ అధినేత నుంచి స్పష్టమైన హామీ రాకపోతే.. వారంతా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారని టాక్. దీంతో కేసీఆర్‌ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారని.. తెలివిగా ఈటల వేరే పార్టీలో ఉన్నా మనవాడే అన్న సంకేతాన్ని రాజకీయ వర్గాలకు పంపించారనే చర్చ జరుగుతోంది. దీంతో ఈటలతో టచ్‌లో ఉండి పార్టీ మారాలనుకున్న వారికి చెక్ పెట్టడంతో పాటు.. బీజేపీలో అలజడి క్రియేట్ చేసి ఆ పార్టీని బలహీన పరచాలనేది సీఎం వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈటల పేరును కేసీఆర్‌ పదే పదే ప్రస్తావించారని చెప్తున్నారు.

నిజానికి ఈటల కూడా ఇదే మాట అంటున్నారు. వ్యూహాత్మకంగా తన పేరును కేసీఆర్‌ ప్రస్తావించారని.. 2004లోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలుస్తానని ప్రచారం చేసారని గుర్తు చేశారు. ఏమైనా అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ నోట ఈటల మాట.. కొత్త చర్చకు కారణం అయింది. ఈ ఎపిసోడ్ చాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఎలా ఉంటుందో చెప్పడానికి అనే చర్చ జరుగుతోంది.