దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పార్టీని, పాలనను వేరేవాళ్లకు అప్పగించి మరీ.. దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. అందరినీ కలిశారు. అందరం కలుద్దామని పిలుపునిచ్చారు. ఏదీ సక్సెస్ కాలేదు. దీంతో దీదీ కూడా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. థర్డ్ ఫ్రంట్ అంటూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిన.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ అని మార్చుకున్నారు. బీజేపీకి బైబై చెప్పి బయటకు వచ్చిన నితీష్ కూడా కొత్త కూటమి కోసం ప్రయత్నించి.. కాంగ్రెస్ ఉండాల్సిందే లేకుంటే తేలే వ్యవహారం కాదు ఇది అని స్టేట్‌మెంట్ ఇచ్చారు చివరికి! కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది.
కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేందుకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. దీదీ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు కూడా ! కాంగ్రెస్ పని అయిపోయింది.. మనమే అంతా ఒక్కటిగా పోటీ చేయాలని.. హస్తాన్ని పక్కనపెట్టి ఇన్నాళ్లు ప్రయత్నాలు చేసిన విపక్ష పార్టీల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నిజానికి కాంగ్రెస్ కాకుండా.. బీజేపీయేతర పార్టీలన్నీ కలిసినా కేంద్రంలో కమలాన్ని కొట్టడం సాధ్యం అయ్యే పని కాదు. ఢిల్లీని ఏలాలంటే కాంగ్రెస్‌తో అయినా ఉండాలి.. కాంగ్రెస్ అయినా వాళ్లతో ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
దేశవ్యాప్తంగా 250కి పైగా లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే యుద్ధం ఉంటుంది. సీట్ల సంఖ్యలో కాంగ్రెస్ తక్కువేమో కానీ.. ఓట్ల విషయంలో హస్తం పార్టీ బలం ఎప్పుడూ తగ్గలేదు. ఇలాంటి పరిణామాలన్నీ ఆలోచించిన విపక్షాలు.. తమ ఆలోచనలను మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు పార్టీలన్నీ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా పార్టీలు బీజేపీ మీద వ్యతిరేకతతో ఉన్నాయ్. ఎవరికి వారే అన్నట్లుగా ఉంటే.. మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని.. అందుకే కాంగ్రెస్ వైపు మద్దతుగా నిలిచేందుకు విపక్ష పార్టీలు రెడీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు దీదీ మాత్రమే మనసులో మాట బయటపెట్టారు. రానున్న రోజులు ఈ స్వరాలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. నితీష్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉండాలంటున్నారు. కేజ్రీవాల్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది.. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్కటి మాత్రం క్లియర్.. దీంతో థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్, ఇంకో ఫ్రంట్.. పేరు ఏదైనా ఇంకో కూటమి మాత్రం ఇప్పట్లో అసాధ్యమే !