ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నార్కోటిక్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని వాల్‌బోర్డుపై సీఎం రాశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సైబర్ సెక్యూరిటీ వింగ్ కోసం14 ఫోర్ వీలర్, 55 టూ వీలర్ వాహనాలు.. యాంటీ నార్కోటిక్ విభాగం కోసం 27 ఫోర్ వీలర్, 59 టూ వీలర్ వాహనాలు ప్రారంభించారు. తెలంగాణలో పోలీసులు అంటే నేరగాళ్లు వణికిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బాధితులతో మాత్రమే ఫ్లెండ్లీ పోలీసింగ్ విధానం అవలంభించాలని చెప్పారు. తెలంగాణలో డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలనే తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుందని డ్రగ్ పెడ్లర్లు, సైబర్ నేరగాళ్లు రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే భయపడాలని వ్యాఖ్యానించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ నిందితులను పట్టుకున్న పోలీసులకు నగదు బహుమతి, పదోన్నతులు కల్పిస్తామని వెల్లడించారు.
సినీ పరిశ్రమలకు సీఎం కండిషన్లు..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై సినీ పరిశ్రమ యువతకు అవగాహన కల్పించట్లేదని పేర్కొన్నారు. సినీ నటులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం వారి వంతు కృషి చేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు సందేశం ఇచ్చే వీడియోలు విడుదల చేయాలని.. సమాజానికి వారి వంతుగా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి కోసం మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చి అవగాహన కల్పించండం ప్రశంసనీయమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం చిరంజీవి ఒక్కరే స్పందించి వీడియో విడుదల చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా మరికొంతమంది సినీ హీరోలు, సినీ పెద్దలు ఈ విషయంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. షూటింగ్ అనుమతులు, సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం దగ్గరకు వస్తున్నట్లుగానే డ్రగ్స్ ను కట్టడి కోసం కూడా ముందుకు రావాలని, అలా వచ్చినప్పుడే వీటిని సమూలంగా నిర్మూలించగలమన్నారు. సమాజం కోసం ఉపయోగపడే వీడియోలను సినిమాకు ముందు ప్రదర్శించాలన్నారు. థియేటర్ల యజమానులు కూడా డ్రగ్స్‌పై అవగాహన డాక్యుమెంటరీ వీడియోలను ప్లే చేయాలని చెప్పారు.