CM Revanth Reddy : జిల్లాల విభజన సరిగా లేదు … త్వరలోనే కమిషన్

తెలంగాణలో త్వరలో జిల్లాల సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు రాబోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ ప్రాతిపదిక లేకుండా ఇష్టమొచ్చినట్టు విభజించారని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే జిల్లాల శాస్త్రీయ విభజనకు ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు.

  • Written By:
  • Publish Date - January 7, 2024 / 09:20 AM IST

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన సరిగా జరగలేదనీ… సుప్రీంకోర్టుల లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఓ కమిషన్ నియమించి శాస్త్రీయంగా అధ్యయనం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చిస్తామన్నారు. జిల్లాలే కాదు రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా BRS ప్రభుత్వం అడ్డగోలుగా ఏర్పాటు చేసిందని అభిప్రాయపడ్డారు. అధికారులు కూడా గందరగోళంలో ఉన్నారనీ అందుకే కమిషన్ ఏర్పాటు చేసి, ఆ రిపోర్టు వచ్చాక ప్రజాభిప్రాయాన్ని కోరతామనీ… అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామన్నారు సీఎం రేవంత్.

జనవరి 31 లోపు నామినేషన్ పదవులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వంద రోజుల్లోపు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్నారు. అలాగే ఎమ్మెల్సీల్లో ఒకటి మైనార్టీలకు, మరొకటి కోదండరామ్ కు ఇస్తామని చెప్పారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నట్టు రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలలోనే 22 వేల కొలువులను భర్తీ చేస్తామన్నారు.
కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటామని చెప్పారు. రాష్ట్రానికి రావల్సిన ప్రాజెక్టులు, నిధులు ఇతర అంశాల్లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇతరులు సానుకూలంగా స్పందించారని చెప్పారు. కేంద్రంతో ఘర్షణ పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ వైఖరితో కేంద్ర పెద్దలు విసిగిపోయారని రేవంత్ చెప్పారు.

తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు మర్యాద కోసం కూడా ఏపీ సీఎం జగన్ కాల్ చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. తన బాస్ కేసీఆర్ ఓడిపోయి… రేవంత్ సీఎం అవడం ఇష్టం లేకపోవచ్చు. కానీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం విషెస్ కూడా చెప్పలేదన్నారు. పైగా తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఢిల్లీలో ఇచ్చిన దావత్ కు వైసీపీలో ఉన్న తన మిత్రులు కూడా వచ్చారు. వాళ్ళని జగన్ తిట్టినట్టు తెలిసిందనీ… అలాంటి ధోరణి పనికిరాదన్నారు. రాజకీయాలు వేరు… స్నేహం వేరు అన్నారు రేవంత్. తెలంగాణకు సంబంధించిన అంశాలపై జగన్ తో చర్చించడానికి తాను సిద్దమే అన్నారు.
కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాలని కేసీఆర్ చూస్తే… తాను వెనుకాడబోనని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి ప్రయత్నం చేయడనే అనుకుంటున్నా అన్నారు. ఒకవేళ మొదలుపెడితే తాను కూడా సిద్ధమే అని రేవంత్ చెప్పారు.