IMD : తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. నైరుతి రాక ఈసారి ముందుగానే..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయ్. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్. గతేడాది సరిగ్గా వర్షపాతం లేకపోవడంతో.. ఈసారి పరిస్థితి ఏంటా అని రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయ్. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్. గతేడాది సరిగ్గా వర్షపాతం లేకపోవడంతో.. ఈసారి పరిస్థితి ఏంటా అని రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈసారి కూడా వానదేవుడు దయ చూపకపోతే ఏంటా అని దిగాలుగా ఉన్న వేళ.. వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ముందే ప్రవేశించే అవకాశం ఉందని.. అధికారులు చెప్తున్నారు. సాధారణంగా ఏటా దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి మే 22న ప్రవేశించే నైరుతి రుతుపవనాలు.. ఈసారి మాత్రం మే 19న ప్రవేశించే చాన్స్ ఉందని అంటున్నారు.

దక్షిణ అండమాన్‌ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీంతో కేరళలోకి జూన్‌ ఒకటో తేదీకల్లా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఐతే ఆ సమయంలో అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉండాలని అంటున్నారు. అంటే.. వాటి ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్ప పీడనం గాని, వాయుగుండం గాని ఏర్పడకూడదన్నమాట. అదే జరిగితే నైరుతి రుతు పవనాల రాకను ఆలస్యం చేస్తాయని చెప్తున్నారు.

గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు మే 19వ తేదీనే దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించినా.. ప్రతికూల పరిస్థితుల వల్ల అవి కేరళను తాకడానికి వారం రోజులు ఆలస్యమైంది. దీంతో జూన్‌ ఒకటికి బదులు 8వ తేదీన కేరళను తాకాయి. ఎల్నినో ప్రభావంతో గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. కురిస్తే కుండపోత, లేదంటే వర్షాభావ పరిస్థితులతో పంటలకు ఆశించిన స్థాయిలో లాభం జరగలేదు.