మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. అతిపెద్ద జాతరకు ముస్తాబవుతోంది. కుంభమేళా కోసం జరుగుతున్న ఏర్పాట్లను చూస్తుంటే అద్భుతః అనిపిస్తున్నాయి. అందులో భాగంగా… ప్రపంచలోనే అతిపెద్ద రంగోలి.. రెడీ అవుతోంది. మెగా ఉత్సవంలో హైలెట్‌గా నిలిచి రికార్డ్ సృష్టించబోతోంది. కుంభమేళా ఏర్పాట్లు…? రంగోలి ముచ్చట్లు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న మహా కుంభమేళా రికార్డులు సృష్టించనుంది. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ల దగ్గర భక్తులపై హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురిపించాలనే ఆలోచనే ఒక అద్భుతం. ఇక భక్తుల రక్షణ కోసం… రోబోటిక్ ఫైర్ టెండర్లను రంగంలోకి దించుతున్నారు. అంతేకాదు… కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు. ఇలా ఎన్నో సరికొత్త ఆలోచనలతో.. ఈసారి మహా కుంభమేళాను.. అత్యద్భుతంగా నిర్వహించబోతున్నారు. ఇప్పుడు.. అతిపెద్ద రంగోలిని తీర్చిదిద్దుతున్నారు. ఇది కుంభమేళాకు హైలెట్‌గా నిలవడమే కాకుండా… ప్రపంచంలోనే పెద్ద రంగోలిగా రికార్డ్ సృష్టించబోతోంది.
కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో… అతిపెద్ద రంగోలి రెడీ అవుతోంది. ఒకటి కాదు, రెండు కాదు… 55వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద కళాకృతిని తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం 11 టన్నుల రంగును కూడా ఉపయోగిస్తున్నారు. భారత దేశ సంస్కృతి, కళాత్మక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ… నైపుణ్యం కలిగిన కళాకారులు, వాలంటీర్ల బృందంతో ఈ రంగోలిని తయారుచేస్తున్నారు. ఆధ్యాత్మిక, ఐక్యత, భక్తికి సంబంధించిన ఇతివృత్తాలను వర్ణించేలా.. ఈ అతిపెద్ద ముగ్గును వేయబోతున్నారు. ఇందులో వాడే రంగులన్నీ… పర్యావరణ హితంగానే ఉంటాయని చెప్తున్నారు. గంగానదికి హాని కలిగించకుండా చూసుకుంటామంటున్నారు నిర్వాహకులు. కుంభమేళాలో నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, గంగా హారతి.. ఎంత అద్భుతంగా ఉంటాయో… ఈ భారీ రంగోలి కూడా అంతే హైలెట్ కానుంది.
మహా కుంభమేళా ప్రాచీన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని చెప్తున్నారు నిర్వాహకులు. ప్రయాగ్‌రాజ్ చుట్టూ ఉన్న ప్రధాన కూడళ్లలో… భారతీయ పురాణాలు, సంస్కృతికి సంబంధించిన కీలక అంశాలను వర్ణించే శిల్పాలను ఏర్పాటు చేస్తున్నారు. యాత్రికులను ఆకర్షించేలా… అర్జునుడు, గరుడ, నంది, ఐరావతం, గంగాదేవి విగ్రహాలను ప్రదర్శించబోతున్నారు. 26 కూడళ్లలో… 26 శిల్పాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ శిల్పాలు దేశం నలుమూలల నుంచి వచ్చే వారినే కాకుండా… విదేశాల నుంచి వచ్చే భక్తులకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.
2013లో మహా కుంభమేళా నిర్వహించగా… ఆ తర్వాత 2019లో అర్ధకుంభమేళా నిర్వహించారు. ఇప్పుడు 2025 జనవరిలో మహా కుంభమేళాను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఇది అతిపెద్ద పండుగ. ఈ పవిత్ర జాతరలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.