Shyam Rangeela: కొంప ముంచిన అత్యుత్సాహం.. మోదీ గెటప్పులో.. మోదీలాగా ట్రై చేసి అడ్డంగా బుక్కైన కమెడియన్

ఒక కమెడియన్ మోదీలాగా ఇలాంటి గెటప్పే వేసుకున్నాడు. అంతేకాదు.. అతడు కూడా మోదీలా అడవిలోకి వెళ్లి అటవీ జంతువులకు ఫుడ్ తినిపించాడు. చివరకు తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు అధికారులు అతడికి నోటీసులు ఇచ్చారు. ఇంతకీ అతడు చేసిన తప్పేంటంటే

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 06:25 PM IST

Shyam Rangeela: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కర్ణాటక, బందీపూర్‌లో ఉన్న టైగర్ రిజర్వ్ పరిధిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ తన సహజ శైలికి భిన్నంగా ప్రత్యేక దుస్తులు ధరించారు. ఖాకీ ప్యాంట్, క్యామోఫ్లాజ్ టీషర్ట్, స్లీవ్‌లెస్ జాకెట్, షూస్, హ్యాట్ ధరించారు. ఈ గెటప్పులో మోదీని చూసిన ఫ్యాన్స్ ఖుషీ ఫీలయ్యారు. మోదీకి సంబంధించిన ఈ గెటప్ అప్పట్లో ట్రెండ్ అయింది. ఇదంతా ఇప్పుడెందుకూ అంటే.. ఒక కమెడియన్ మోదీలాగా ఇలాంటి గెటప్పే వేసుకున్నాడు. అంతేకాదు.. అతడు కూడా మోదీలా అడవిలోకి వెళ్లి అటవీ జంతువులకు ఫుడ్ తినిపించాడు. చివరకు తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు అధికారులు అతడికి నోటీసులు ఇచ్చారు. ఇంతకీ అతడు చేసిన తప్పేంటంటే
శ్యామ్ రంగీలా
ప్రముఖ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శ్యామ్ రంగీలా తరచూ నేతల్ని ఇమిటేట్ చేస్తూ కామెడీ చేస్తుంటాడు. తాజాగా మోదీని అనుకరించాలనుకున్నాడు. ఇటీవల మోదీ బందీపూర్‌లో పర్యటించినట్లుగానే రంగీలా కూడా అలాగే డ్రెస్ చేసుకున్నాడు. రాజస్థాన్, జైపూర్ పరిధిలోని ఝలానా లెపర్డ్ రిజర్వ్ ప్రాంతానికి వెళ్లాడు. మోదీ గెటప్పులో అక్కడికి వెళ్లిన రంగీలా అక్కడి జంతువులకు ఆహారం తినిపించాడు. ఒక నీల్గాయ్‌కు తన చేతితో ఫుడ్ తినిపించాడు. దీన్ని వీడియో తీసుకున్నాడు. తర్వాత దీనికి సంబంధించిన వీడియోను అతడు ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. గత వారం ఆ వీడియో వైరల్ అయింది. కమెడియన్ చేసిన పని అటవీ శాఖ అధికారుల కంటపడింది. ఇంకేముంది.. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రీజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
అసలు తప్పు ఏంటంటే..
అడవి జంతువులకు ఆహారం తినిపించడమే రంగీలా చేసిన పొరపాటు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం.. ఇలా అడవి జంతువులకు బయటి ఆహారం తినిపించడం నేరం. జంతువులు తమ పరిధిలో సహజంగా దొరికే ఆహారం మాత్రమే తీసుకుంటాయి. వాటికి బయటి ఆహరం తినిపించడం వల్ల అవి జబ్బులపాలయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆహారం వాటికి విషంగా కూడా మారొచ్చు. అందుకే నీల్గాయ్‌కు ఆహారం తినిపించినందుకు అతడికి నోటీసులిచ్చారు. అడవుల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి, ఈ విషయంపై సందర్శకులకు సూచనలు కూడా చేస్తారు అధికారులు.

అవేవీ రంగీలా పట్టించుకోకుండా వీడియో కోసం ఆహారం తినిపించాడు. పైగా ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, ఇతరులు కూడా అలాంటి పని చేసేలా రెచ్చగొట్టడం అతడు చేసిన మరో తప్పు. ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ యాక్ట్ 1953, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం రంగీలా చేసిన పని చట్టరీత్యా నేరం. ఈ విషయంపై అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తానికి మోదీని అనుకరించేందుకు శ్యామ్ రంగీలా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అతడిని చట్టం ముందు దోషిగా నిలబడేలా చేస్తోంది.