సమోసాలు అంటే చాలామందికి ఇష్టం. మనం తినే సమోసా (Samosa) ల్లో ఆలు, ఉల్లి, ఇతర మసాలాలతో స్టఫ్ ఉంటుంది. అందుకే టేస్ట్ బాగుంటుంది. కానీ పుణెలో మాత్రం సమోసాల్లో కండోమ్స్, గుట్కా (Gutka) ప్యాకెట్లు, గులకరాళ్ళు కనిపించడంతో జనం అవాక్కయ్యారు.
పుణేలోని టాటా మోటార్స్ కంపెనీలోని క్యాంటిన్ కి SRS సంస్థ నుంచి సమోసాలు సప్లయ్ అవుతుంటాయి. ప్రతి రోజు లాగే ఇవాళ కూడా వచ్చాయి. వాటిని టాటా ఉద్యోగులు తిన్నారు. అలా తింటూ ఉండగా… కొన్నింటిలో కండోమ్‌లు, గుట్కాలు, గులకరాళ్ళు రావడంతో ఆశ్చర్యపోయారు. సమోసాలు తిన్న ఉద్యోగుల్లో కొందరు అస్వస్థులయ్యారు. మరికొందరు వాంతులు చేసుకున్నారు. టాటా మోటార్స్ కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులు విచారణ జరిపారు.
సమోసాలు సప్లయ్ చేసే SRS కంపెనీలో మాజీ ఉద్యోగులు కొందరు ఈ కుట్ర చేసినట్టు తేలింది. తమను ఉద్యోగాల నుంచి తీసేశారన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. గతంలో సమోసా కేటరింగ్ కంపెనీ తయారు చేసిన సమోసాల్లో బ్యాండేజ్ వచ్చింది. దాంతో ఆ కంపెనీ ముగ్గురు ఉద్యోగులను తొలగించింది. కంపెనీపై కోపంతో అదే సంస్థలో పనిచేస్తున్న మరో ఇద్దరితో కలసి ఈ కుట్రకు పాల్పడ్డారు మాజీ ఉద్యోగులు. సమోసాల్లో కండోమ్స్, గుట్కా ప్యాకెట్లు, రాళ్ళు నింపు తయారు చేయించారు. ఈ సంఘటనకు బాధ్యులైన ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సమోసాలు తిని అస్వస్థులైన టాటా ఉద్యోగులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎందుకైనా మంచిది… మీరు సమోసా తినేముందు ఓ సారి చెక్ చేసుకోండి అని సోషల్ మీడియాలో నెటిజన్లు సలహా ఇస్తున్నారు.