వై నాట్ 175 అంటూ (Y NOT 175) .. రెండోసారి అధికారంలోకి రావడానికి అధికార వైసీపీ నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తోంది. వైసీపీ చీఫ్, సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) .. ఇప్పటికే 3 లిస్టులు ప్రకటించారు. ఇంకో జాబితా కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. కొందరు సిట్టింగ్స్ కి టిక్కెట్లు ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. వాళ్ళల్లో కొందరు టీడీపీ, కాంగ్రెస్ లోకి జంప్ అవగా.. మరికొందరు రెడీ టు.. అన్న పొజిషన్ లో ఉన్నారు. 2019లో అన్ని నియోజకవర్గాల్లో ఏకతాటిపై ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ఈ మార్పుల తర్వాత గ్రూపులుగా విడిపోతున్నారు. దాంతో కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడింది.
సర్వేలు, సామాజిక సమీకరణాల పేరుతో వైఎస్ జగన్.. నియోజకవర్గాల్లో తమ పార్టీ MLA, MP అభ్యర్థులను మార్చుకుంటూ వస్తున్నారు. మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మంది.. మూడో లిస్ట్ లో21 మందితో ఇంఛార్జుల లిస్ట్ ప్రకటించారు. ఇంకా ఫోర్త్ లిస్ట్ కూడా ఉంటుందని అంటున్నారు. సంక్రాంతి పండగ తర్వాత ఇది రిలీజ్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన జాబితాల్లో కొంతమంది సిటింగ్స్ తమ స్థానాలు కోల్పోయారు. కొందరిని వేరే నియోజకవర్గాలకు షిప్ట్ చేశారు. అయితే లిస్టుల్లో తమ పేరు దక్కని వైసీపీ లీడర్లు.. పార్టీని వదిలిపెట్టడానికి సిద్ధమయ్యారు. కొందరు మాత్రం వైసీపీలోనే ఉండి.. తమకు కాకుండా వేరే లీడర్ కు ఎలా ఇస్తారని… తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. దాంతో రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ 3 నుంచి నాలుగు గ్రూపులు తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ గ్రూపులను సీనియర్ నాయకులు బుజ్జగిస్తే సరి.. లేకపోతే ఇవి ఎన్నికల దాకా కంటిన్యూ అయితే వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి.
పెనుమలూరులో పార్థసారధి స్థానాన్ని మంత్రి జోగి రమేష్ కు కేటాయించారు. వైసీపీ థర్డ్ లిస్ట్ లో ఈ మార్పు జరిగింది. కానీ పార్థసారధి అదే నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు టీడీపీ (TDP) లోకి వెళ్ళాలని చూస్తున్నారు. ఈనెల 21న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారని చెబుతున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లతో సంప్రదింపులు చేశారు. ఇక కాకినాడకు చెందిన ఎమ్మల్యే పెండెం దొరబాబు.. వైసీపీ (YCP) అధిష్టానం గుర్రుగా ఉన్నారు. తన సీటును వంగా గీతకు ఇవ్వడమే ఇందుక్కారణం. బలనిరూపణకు సిద్ధమైన దొరబాబు.. రేపో, మాపో వైసీపీని వీడే అవకాశముంది. ఏలూరుకు చెందిన ఎలీజా కూడా తనకు కాకుండా వేరే వాళ్ళకి టిక్కెట్ ఇస్తుండటంపై మండిపడుతున్నారు. పార్టీ మారాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. ఇలా ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీలో గందరగోళం నడుస్తోంది.
సీట్లు మార్చిన వారి విషయంలోనూ అనేక విమర్శలు వస్తున్నాయి. అక్కడ చెల్లని కాసు.. ఇక్కడ చెల్లుతుందా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో సరిగా పనిచేయడం లేదని మార్చినప్పుడు.. ఇక్కడ మాత్రం ఎలా పనిచేస్తారని పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నారని కొందరు సీనియర్ లీడర్లు అధిష్టానంపై మండిపడుతున్నారు. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే.. సముచిత స్థానం ఇస్తామని హామీ ఇస్తోంది వైసీపీ అధిష్టానం. పార్టీ పెద్దలు ఎంతమంది బుజ్జగించినా సీనియర్లు మాత్రం వైసీపీని వదిలిపోవడానికే డిసైడ్ అవుతున్నారు