కాంగ్రెస్ పార్టీ (Congress party) దేశవ్యాప్తంగా నిధుల సేకరణ మొదలుపెట్టింది. దేశం కోసం విరాళం (Donate for the country) పేరుతో ఆన్ లైన్ లో ఈ క్రౌడ్ ఫండింగ్ ప్రచార కార్యక్రమం జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగి, 60యేళ్ళకు పైగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ విరాళాలు ఎందుకు వసూలు చేస్తోంది… పార్టీ ఫండ్ లేదా… ? కేంద్రంలో వరుసగా రెండు సార్లు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడంతో… కాంగ్రెస్ కి ఎవరూ విరాళాలు ఇవ్వడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021-22 లో దేశంలోని 8 ప్రధాన రాజకీయ పార్టీల దగ్గర విరాళాలను చూస్తే… అన్నింటి కంటే 6 వేల కోట్లకు పైగా బీజేపీ (BJP Funds) దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ దగ్గర 8 వందల కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ కంటే బీజేపీ దగ్గర ఏడు రెట్లు ఎక్కువగా పార్టీ ఫండ్ ఉంది.
రాబోయే లోక్ సభ ఎన్నికలు నిజానికి కాంగ్రెస్ కు విషమపరీక్షే. ఇప్పటికే పదేళ్ళ పాటు బీజేపీ అధికారంలో ఉంది. పార్టీకి ఫండ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఆ నిధులు సరిపోవు. ఇప్పుడు ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా అయినా అభిమానుల నుంచి కొంత నిధులు సమకూర్చుకోవచ్చని భావిస్తోంది. డొనేట్ ఫర్ ద కంట్రీ వెబ్ పోర్టల్ కి 18యేళ్ళ నిండిన వారు నిధులను పంపవచ్చు. ఇందులో 138 రూపాయలు … లేదంటే 1380 లేదా 13 వేల 800 రూపాయలను విరాళంగా ఇవ్వొచ్చు. ఇంకా ఎక్కువ ఇచ్చినా విరాళాలను స్వీకరిస్తోంది కాంగ్రెస్.
క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంత మొత్తం వసూలు చేయాలి… అన్న లక్ష్యమేదీ పెట్టుకోలేదని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. సేకరించిన మొత్తం నిధుల్లో 50శాతాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తారట. దాని మీద వచ్చే వడ్డీని పార్టీ కార్యక్రమాల కోసం వాడుకుంటారు. మిగిలిన అమౌంట్ ను రాష్ట్రాల్లోని తమ పార్టీ కమిటీలకు పంపుతారట. నాగ్ పూర్ లో ఈమధ్య జరిగిన కాంగ్రెస్ సభలో కూడా విరాళాల సేకరణపై చర్చకు వచ్చింది. తమకు పారిశ్రామికవేత్తలు నేరుగా డబ్బులు ఇవ్వడానికి భయపడుతున్నారనీ… అందుకే జనం నుంచి సేకరిస్తున్నట్టు కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ విరాళాల సేకరణపై బీజేపీ లీడర్లు మండిపడుతున్నారు. 60యేళ్ళ పాటు దేశాన్ని దోచుకుతిన్నారు… ఇప్పుడు దేశం కోసం విరాళాలు ఇవ్వాలని అడగడమేంటని ఎద్దేవా చేస్తున్నారు. ఈ 60యేళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో స్కాములు చేసింది. లీడర్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని మండిపడుతున్నారు బీజేపీ లీడర్లు.
దేశం కోసం విరాళం కార్యక్రమం మహాత్మాగాంధీ స్ఫూర్తితో చేపట్టినట్టు కాంగ్రెస్ చెబుతోంది. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీ… స్వరాజ్ ఫండ్ ఏర్పాటు చేశారని అంటున్నారు. అయితే ఒక్క కాంగ్రెస్ పార్టీ తరపునే విరాళాలు సేకరించకుండా… ఇండియా కూటమి పేరుతో సేకరిస్తే బాగుండేదని కొందరు సలహా ఇస్తున్నారు. అప్పుడు ప్రజల నుంచి స్పందన బాగుండేదని అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు… తమకు అవకాశం ఇవ్వాలనీ… విరాళాల కోసం ఇండియా కూటమి తరపున విజ్ఞప్తి చేస్తే బెటర్ అని సలహా ఇస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ఖర్చును భరించే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. దాంతో తెలంగాణ, కర్ణాటక లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విరాళాల సేకరణ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం వెనక కారణం కూడా అదేనని అప్పట్లో వార్తలు వచ్చాయి.