తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన హామీలతో పాటు బడ్జెట్ అంశాలపై చర్చించేందుకు ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. వారం రోజుల పాటు జరిగే శాసన సభ సమావేశాల్లో 25 లేదా 26న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇదే నెలలో 23న కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు, కేటాయింపుల ఆధారంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే రైతుభరోసా, రైతు రుణమాఫీతో పాటు మరికొన్ని అంశాలపై కూడా వాడి వేడి చర్చ జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ నిర్వహణకు సంబంధిచిన సీఎం అధికారులతో చర్చలు కూడా జరిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న రెండో అసెంబ్లీ ఇది.
ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఒక్కటే. కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా లేదా అని. అయితే కేసీఆర్ రెండో సెషన్‌కు కూడా రాకపోవొచ్చనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో బలం తగ్గిపోవడం, కేసీఆర్ వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ విరుచుకుపడుతుందని బీఆర్ఎస్ భావించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో వచ్చి అవమానపడటం కంటే ఈసారి కూడా అసెంబ్లీ బాధ్యతను కేటీఆర్, హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి సెషన్‌కు కూడా కేసీఆర్ రాలేదు. కేటీఆర్ హరీష్ రావు మాత్రమే హ్యాండిల్ చేశారు. ఇప్పుడు కూడా వీళ్లిద్దరే అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత రెండో సారి జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు.. 6 గ్యారెంటీల అమలు, నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రజాసమస్యలు, పాలనపరమైన నిర్ణయాలతో పాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, కాంగ్రెస్ పార్టీ చేరికలను ప్రోత్సహించడం వంటి అంశాలపై కూడా కాంగ్రెస్‌ను కడిగిపారేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.