కర్ణాటక విజయాన్ని ఆస్వాదిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. కొద్దినెలల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్.. గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. ఈసారి ఎలాగైనా గెలవాలని లక్ష్యం పెట్టుకుంది. తెలంగాణ ఎన్నికల బాధ్యతను ప్రియాంక గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అధిష్ఠానం అప్పగించింది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. ప్రచార వ్యూహాలు, నియోజకవర్గాల వారీగా సర్వేలు, బీఆర్‌ఎస్ పార్టీపై ఎదురుదాడి, అభ్యర్థుల ఎంపికపైనా హస్తం పార్టీ ఫోకస్పెట్టింది.
ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతో ఇప్పటివరకు పార్టీ చేసిన కార్యక్రమాలను ఇంటింటికి చేర్చేందుకు.. కాంగ్రెస్ శ్రేణులతో సహా అనుబంధ విభాగాలను పూర్తిస్థాయిలో మోహరించాలని నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహారించాలనే కాంగ్రెస్ పెద్దలు నిర్ణయానికి వచ్చారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అభ్యర్థుల ఎంపికపై పారదర్శక విధానాన్ని అనుసరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికోసం మూడంచెల వడపోత ప్రక్రియను అనుసరించనుంది. రాష్ట్రంలోని 119నియోజకవర్గాల్లో 40 నుంచి 50 చోట్ల వివాదం లేకుండా ఒక్క అభ్యర్థే పోటీలో ఉన్నారని పీసీసీ అంచనా వేస్తోంది. ఐతే వారిని సర్వేల అధారంగా ముందే ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇక అటు కేసీఆర్ వ్యూహాలను పసిగట్టిన కాంగ్రెస్.. ఆపరేషన్ ఆకర్ష్‌తో ఎన్నికలకు రెడీ అవుతోంది. కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్‌తో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ కాంగ్రెస్.. ఇక్కడా అదే జోరు చూపించాలని ఫిక్స్ అయింది.
బీఆర్ఎస్‌తో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పొత్తు లేదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేయడంతో.. కుటుంబ పాలన కావాలా, ప్రజా పాలన కావాలా అనే నినాదంతో బీఆర్ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలు జనాల దగ్గరకు వెళ్లనున్నారు. రాహుల్ ఆదేశాలతో నేతలంతా కలిసికట్టుగా జనాల్లోకి వెళ్లి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక ఎన్నికల వ్యూహాలను తెలంగాణలోనూ అవలంబించేందుకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు సంస్థాగతంగా పార్టీ బలోపేతం, ఖాళీగా ఉన్న పదవులను టీపీసీసీ భర్తీ చేయనుంది. ఎన్నికల్లో ప్రత్యర్థిని ఎలా ఓడించాలన్న దానిపై కాదు.. ఎలా గెలవాలన్నది ఆలోచించాలి. ప్రస్తుత సమీకరణాలు చూస్తే.. బీఆర్ఎస్ సర్కార్‌ను ఢీకొట్టడంతో పాటు.. దక్షిణాదిలో విస్తరించాలని కలలు కంటున్న బీజేపీకి కూడా గట్టి షాక్ ఇచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సాధ్యమయ్యే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు బలమైన వ్యహం ఉండాల్సిన అవసరం ఉంటుంది.
2018ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో కోల్పోయిన సీట్లపై కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలి. అక్కడ లోటుపాట్లను సవరించుకోవాలి. లేకపోతే 2019 పార్లమెంట్ ఎన్నికల మాదిరి పరిణామాలకు కూడా స్కోప్ ఉంటుంది. 2018ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేని బీజేపీ.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన పార్లమెంట్ స్థానాలను గెలిచుకుంది. అయితే అధికార పార్టీపై ఉండే వ్యతిరేకతను క్యాష్ చేసుకునే విషయంలో బీజేపీ కంటే.. కాంగ్రెస్ చాలా అప్రమత్తంగా ఉంటేనే అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని ఓటర్లు మార్పు కోరుకుంటే.. రెండు జాతీయ పార్టీల్లో ఏదో ఒకవైపు ఆలోచిస్తారు. ఈ విషయానికొస్తే బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకత్వం పరిగణలోకి తీసుకొని.. అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా పని చేస్తే.. తెలంగాణను కూడా హస్తగతం చేసుకునే ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందనే చెప్పొచ్చు.