ఎన్నికల హామీలను ఒక్కోటిగా నెరవేర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అయింది. ముందుగా 6 గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం ఒకటయితే.. మరొకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పేరుతో తీసుకొచ్చిన ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. దీంతో ఆర్టీసీ బస్సు ప్రయాణంలో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా మహిళలు.. ఆర్టీసీ బససుల్లో రికార్డు స్థాయిలో ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 60శాతం మంతి మహిళలు ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారు. మంగళవారం ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 51లక్షల మంది ప్రయాణించగా.. అందులో 20 లక్షల మంది పురుషులు కాగా.. 30లక్షల మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా ఆర్టీసీలో 50లక్షల మంది ప్రయాణికులు ఎక్కితే 18కోట్లు ఉండే ఆదాయం వస్తుంది. ఐతే ఇప్పుడు మాత్రం మంగళవారం ఒక్కరోజు 11 కోట్ల 74 లక్షల ఆదాయం వచ్చింది.
ఇక అటు జిల్లాలవారీగా చూసినా మహిళలు రికార్డు స్థాయిలో ఫ్రీ బస్సు సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో ప్రతిరోజు సగటున రెండు లక్షల పైగా మహిళలు జీరో టికెట్ ద్వారా ప్రయాణం చేస్తున్నట్లుగా ఆర్టీసీ సంస్థ గుర్తించింది. బస్సు ఆక్యుపెన్సిలో 70శాతం మహిళలే ప్రయాణం చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలు వెళ్లేందుకు ఉచిత బస్సు సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు మహిళలు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌తో పాటు వేములవాడ, కాలేశ్వరం వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే రూట్లలో ప్రయాణం చేస్తున్నారు. ఓవరాల్‌గా అందివచ్చిన అవకాశాన్ని అతివలు అద్భుతంగా వినియోగించుకుంటున్నారు.