Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ నెల 22న దేవాలయం ప్రారంభోత్సవం జరగనుంది. సినీ, క్రీడా, వ్యాపారం సహా వివిధ రంగాల ప్రముఖులకు రాజకీయ నేతలకు, పార్టీలకు ఈ వేడుకలకు ఆహ్వానం అందింది. అయితే, ఈ వేడుకలకు కాంగ్రెస్ హాజరవుతుందా.. లేదా అనే సందేహానికి తెరపడింది. కాంగ్రెస్ పార్టీ ఈ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రకటించింది.
Flipkart Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు..
ఈ వేడుకలకు తాము హాజరుకాబోమని స్పష్టం చేసింది. రామ మందిర ప్రారంభ కార్యక్రమం పూర్తిగా బీజేపీ, ఆరెస్సెస్ కార్యక్రమంలా ఉందని ఆరోపించింది. ఇదో రాజకీయ ప్రాజెక్టులా ఉందని కాంగ్రెస్ విమర్శించింది. అందువల్ల తాము హాజరుకావడం లేదని తెలిపింది. ఈ కార్యక్రమం కోసం రామాలయ ట్రస్టు.. కాంగ్రెస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి వంటి నేతలకు ఆహ్వానం పంపింది. కానీ, తాము ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఆరెస్సెస్, బీజేపీ.. రామాలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చారని, అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని ప్రారంభించడం బీజేపీ రాజకీయ లాభం కోసమే అని, అందువల్లే తాము ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
ఈ అంశంలో కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. మరి.. కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ఆలయ ప్రారంభోత్సవం కోసం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.