క్యాన్సర్ ను జయించి.. ఒలింపిక్స్ బరిలో నిలిచి

  • Written By:
  • Publish Date - August 5, 2024 / 08:03 PM IST

ఏ క్రీడాకారుడికైనా అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలవడమే లక్ష్యం…ఇక ఒలింపిక్స్ మెడల్ గెలవడం వారికి చిరకాల స్వప్నంగా ఉంటుంది. దీని కోసం ఎంతో శ్రమిస్తుంటారు. అయితే తైవాన్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ చో చెన్ మాత్రం ప్రాణాంతక క్యాన్సర్ తో పోరాడి ఒలింపిక్స్ బరిలో నిలిచాడు. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో లక్ష్యసేన్ చేతిలో ఓడిపోయిన చో చెన్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గత ఏడాది క్యాన్సర్ బారిన పడిన ఈ తైవాన్ ప్లేయర్ పట్టుదలతో కోలుకున్నాడు. తనకు కొలెరెక్టల్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు గతేడాది పరీక్షలో తేలిందని చెన్ తాజాగా వెల్లడించాడు. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడంతో చికిత్సకు సమయం దొరికిందని చెప్పుకొచ్చాడు. అయితే దీని గురించి కుటుంబం, స్నేహితులకు కూడా చెప్పలేదని వైద్యుల అనుమతితో ఒలింపిక్స్‌లో పాల్గొన్నట్టు తెలిపాడు.

క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత కోలుకోవడం ఒక ఎత్తయితే ఫిట్ నెస్ సాధించడం మరో ఎత్తు… అయితే సర్జరీ అనంతరం చెన్‌ వేగంగానే కోలుకున్నాడు. మళ్లీ ఫిట్ నెస్ సాధించి బాడ్మింటన్‌ కోర్టులో అడుగుపెట్టాడు. దీని కోసం చాలా తీవ్రంగానే శ్రమించినట్టు చెన్ చెప్పుకొచ్చాడు. గతేడాది స్విస్‌ ఓపెన్‌లో సెమీ- ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత జర్మనీలో జరిగిన హైలో ఓపెన్‌ను గెలుచుకున్నాడు. తాజాగా ఒలింపిక్స్ లోనూ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. భారత సంచలనం లక్ష్యసేన్ చెన్ పై గెలిచిన తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోకుండా అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాడు. అతని క్యాన్సర్ విషయం తెలిసిన లక్ష్యసేన్ చెన్ కు హ్యాట్సాఫ్ చెప్పాడు.