ఏపీలో వైస్సార్ సర్కార్ ఘోరంగా ఓడిపోవడంతో జగన్ పాలనలో ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. సేమ్ టు సేమ్ తెలంగాణలో కేసీఆర్ లాగే కోటరీ నమ్ముకొని జగన్ చావుదెబ్బతిన్నారు. ఇక్కడ కనీసం brs కు జనం 39 సీట్లయినా ఇచ్చారు. అక్కడ మరీ వైసీపీకి 11 సీట్లే. నాకేంటి అనే అహంకారం… ఎమ్మెల్యేలకు కనీసం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం. కనీసం వాళ్ళని ఇక్కడ ప్రగతి భవన్, అక్కడ తాడేపల్లి క్యాంపాఫీస్ లోపలికి అడుగపెట్టకుండా కోటరీ అడ్డుకోవడం… కేసీఆర్, జగన్… ఈ ఇద్దరి నేతల పతనానికి దారితీసింది.
వైసీపీ హయాంలో తమ ఇబ్బందులను ఒక్కోటి నోరు విప్పి చెబుతున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. సీఎం జగన్ ని కలవడానికి ఆఫీసుకు వెళితే… లోపలికి అడుగుపెట్టనీయలేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. గంటలు గంటలుగా సీఎం రూమ్ లో ధనుంజయ్ రెడ్డి తిష్టవేసేవాడనీ… తాను రాత్రి దాకా ఆఫీస్ దగ్గర పడిగాపులు పడాల్సి వచ్చేదన్నారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ని ఊహల్లో ఉంచిందనీ… ధనుంజయ్ రెడ్డి లాంటి చెత్త అధికారి సీఎంలాగా వ్యవహరించారని మండిపడ్డారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. cmo లో ఎవడెవడో కూర్చొని గంటలు గంటలు మాట్లాడేవారు… ఎమ్మెల్యేలే కాదు… మంత్రులు కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలోనూ కేసీఆర్ ప్రగతి భవన్ లో ఇలాంటి రాజ దర్భార్ ను మెయింటైన్ చేసేవారు. కేసీఆర్ ని కలవడానికి మంత్రులకు, ఎమ్మెల్యేలకు పర్మిషన్ ఉండేది కాదు. ఒకరిద్దరు మంత్రులకు మాత్రమే పర్మిషన్ ఉండేది. కొందరు ఎమ్మెల్యేలైతే కేసీఆర్ కాదు… కేటీఆర్ ను కూడా కలవలేకపోయే వాళ్ళమని చెప్పేవాళ్ళు. ఏపీలో జనంలో కలవకుండా జగన్ పరదాలు కట్టుకున్నారు. ఇటు కేసీఆర్ అయితే రాష్ట్రంలో ఎంత తీవ్రమైన సంఘటన జరిగినా… ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే వారు కాదు. ఇలాంటి రాజరికపు పోకడలు ఉన్నందువల్లే జనం brs, వైసీపీని తిప్పికొట్టారని విశ్లేషకులు మండిపడుతున్నారు.