పిచ్ ను అంచనా వేయలేకపోయా తప్పు తనదేనన్న రోహిత్

భారత్, న్యూజిలాండ్ తొలి టెస్ట్ బెంగళూరు వేదికగా మొదలైంది. వర్షంతో తొలిరోజు ఆట పూర్తిగా రద్దయినా రెండోరోజు షెడ్యూల్ ప్రకారమే ఆట ప్రారంభమైంది. అనూహ్యంగా భారత్ తొలి ఇన్నింగ్స్ లే కేవలం 46 పరుగులకే కుప్పకూలింది.

  • Written By:
  • Publish Date - October 18, 2024 / 10:51 AM IST

భారత్, న్యూజిలాండ్ తొలి టెస్ట్ బెంగళూరు వేదికగా మొదలైంది. వర్షంతో తొలిరోజు ఆట పూర్తిగా రద్దయినా రెండోరోజు షెడ్యూల్ ప్రకారమే ఆట ప్రారంభమైంది. అనూహ్యంగా భారత్ తొలి ఇన్నింగ్స్ లే కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోకుండా పేస్ పిచ్ పై బ్యాటింగ్ కు దిగడం కొంపముంచింది. ఫలితంగా సీనియర్ బ్యాటర్లతో సహా ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. అయితే పిచ్ ను సరిగా అంచనా వేయలేకపోయానని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. తప్పు తనదేనంటూ అంగీకరించాడు. ఈ స్థాయిలో పేస్ కు సహకరిస్తుందని అస్సలు అనుకోలేదన్నాడు. ఫ్లాట్ వికెట్ గా ఉంటూ క్రమంగా స్పిన్ కు అనుకూలిస్తుందని భావించినట్టు చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే బ్యాటింగ్ ఎంచుకున్నానని, తమ అంచనా తప్పయిందని రోహిత్ ఒప్పుకున్నాడు.

చాలా బ్యాడ్ డే గా అభివర్ణించిన హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ మిగిలిన రోజులు తమకు పెద్ద ఛాలెంజ్ గా ఉండబోతున్నట్టు చెప్పాడు. ఇలాంటి సవాళ్ళను అధిగమించినప్పుడే అసలు సత్తా బయటపడుతుందన్నాడు. అయితే తమ బ్యాటర్లు కాస్త ఓపికతో ఆడి ఉంటే మంచి స్కోర్ చేసి ఉండేవాళ్ళమని రోహిత్ అంగీకరించాడు. నిజానికి లంచ్ తర్వాత పిచ్ కాస్త బ్యాటర్లకు, కొంచెం స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో కివీస్ భారీస్కోర్ దిశగా సాగుతోంది. రెండోరోజు ఆటముగిసే సమయానికి కివీస్ 3 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఇప్పటికే 134 పరుగుల ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ ను భారత్ బౌలర్లు ఎంత త్వరగా ఆలౌట్ చేస్తారనేది చూడాలి.

మూడోరోజు వెదర్ రిపోర్ట్ లో వర్షం కురిసే అవకాశాలు కాస్త తక్కువగానే ఉండడంతో ఇక స్పిన్నర్లపైనే టీమిండియా భారం వేసింది. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్ ఆడడం కూడా భారత బ్యాటర్లకు సవాలే. కివీస్ భారీ ఆధిక్యానికి ధీటుగా స్పందించకుంటే మాత్రం ఓటమి తప్పదు. అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం భారత్ ఎదురుదెబ్బగా చెప్పాలి. కీపింగ్ చేస్తుండగా అతని మోకాలికి బంతి బలంగా తాకడంతో చివరి సెషన్ లో గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ కీపింగ్ బాధ్యతలు తీసుకోగా… రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయానికి కోలుకుంటాడని రోహిత్ శర్మ చెప్పాడు. కారు యాక్సిడెంట్ లో సర్జరీ జరిగిన కాలికే ఇప్పుడు గాయమవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.