COVID 19: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా.. ఉస్మానియాలో ఇద్దరు మృతి

తెలంగాణలో నమోదైన పది కేసుల్లో 9 కేసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు కోలుకున్నారు. 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఏపీకి సంబంధించి 24గంటల్లో 5 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 05:46 PM IST

COVID 19: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో 5 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణకు సంబంధించి ఇంతకాలం హైదరాబాద్‌కే పరిమితమైన కరోనా వైరస్‌ ఇప్పుడు జిల్లాలకు పాకింది. మొన్న జయశంకర్ భూపాలపల్లిలో ఒకే కుటుంబంలో ఐదుగురు సభ్యులకు పాజిటివ్‌ నిర్దారణ కాగా, ఇప్పుడు కరీంనగర్‌లో మరో కేసు నమోదైంది.

Tsunami 2004: సునామీ ప్రళయానికి 19 ఏళ్లు.. వేల మందిని పొట్టనపెట్టుకున్న మహా ప్రళయం

తెలంగాణలో నమోదైన పది కేసుల్లో 9 కేసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు కోలుకున్నారు. 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వారి బంధవులు, సన్నిహితులను అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ఇప్పటి వరకు కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 కేసులు నమోదు కాలేదని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఇతర ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు కరోనా సోకి మరణించారు. వారిలో ఒకరి వయసు 60 సంవత్సరాలు కాగా, మరొకరు 42 సంవత్సరాలు. ఇంకా ముగ్గురు ఐసోలేషన్ వార్డ్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇద్దరు పీజీ మెడికోలకు పాజిటివ్ సోకగా.. వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీకి సంబంధించి 24గంటల్లో 5 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29 యాక్టివ్ కేసులున్నాయి. కొందరిలో జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఉన్నాయి. వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌‌గా తేలింది. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా కొత్త సబ్‌-వేరియంట్‌ ‘జేఎన్‌.1’ కేసులు 64 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.