Andrew Flintoff: అయ్యయ్యో ఇలా అయ్యాడేంటి?

కారు యాక్సిడెంట్ తరువాత ఫ్లింటాఫ్‌ను చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 03:26 PM IST

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రపంచానికి అందించిన ఆల్ రౌండర్లలో దిగ్గజ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అని చెప్పడంలో సందేహమే అవసరం లేదు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్‌తో గొడవపడ్డాక అతడు భారత అభిమానులకు కూడా సుపరిచితమయ్యాడు. 2000వ దశకంలో ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ మాజీ ఆల్ రౌండర్‌ మీడియాలో కనిపించక చాలా కాలమైంది. గతేడాది ఓ కారు ప్రమాదానికి గురైన ఫ్లింటాఫ్.. తొమ్మిది నెలల తర్వాత ప్రజల ముందుకువచ్చాడు.

ముఖం మీద గాయాలతో అసలు గుర్తుపట్టరాకుండా అయిపోయిన ఫ్లింటాఫ్‌ను చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆరు అడుగుల ఎత్తు, అందుకు తగ్గ బరువుతో హాలీవుడ్ సినిమాలలో హల్క్‌లా ఉండే ఫ్లింటాప్ ముఖమంతా పాలిపోయి గాయాలతో ముక్కు, పెదవి దగ్గర గాయాలతో గుర్తుపట్టకుండా మారిపోయాడు. ఐ సినిమాలో ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత మరుగుజ్జుగా ఉండే విక్రమ్‌ను పోలి ఉన్నట్టు అనిపించక మానదు. ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ మధ్య కార్డిఫ్ వేదికగా జరిగిన తొలి వన్డేకు ఫ్లింటాఫ్ హాజరయ్యాడు.

పెవిలియన్‌లో ఉన్న బాల్కనీ నుంచి ఇంగ్లాండ్ కోచింగ్ స్టాఫ్ డ్రెస్ కోడ్ వేసుకుని మ్యాచ్‌ను వీక్షించాడు. గతేడాది డిసెంబర్‌లో ఫ్లింటాఫ్ ప్రముఖ టీవీ ఛానెల్ బీబీసీ నిర్వహించిన ‘టాప్ గేర్’ షో లో ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ఫ్లింటాఫ్‌ కారు ప్రమాదానికి గురైంది. తీవ్రమైన గాయాలతో రక్తపు మడుగులో ఉన్న ఫ్లింటాఫ్‌ను ప్రత్యేక హెలికాప్టర్‌లో తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఫ్లింటాఫ్ పక్కటెముకలు విరగడమే గాక ముఖం, దవడలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రమాదం తర్వాత ఫ్లింటాఫ్ బయట ప్రజలకు కనిపించడం మాత్రం ఇదే ప్రథమం.