తెలంగాణలో బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య కరెంట్ విషయంలో జరిగిన మాటల పోరు అంతా ఇంతా కాదు. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా అంటూ బీఆర్ఎస్ నేతలు.. మేం వస్తే 24 గంటలు కరెంట్ ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు.. ఎన్నికల ప్రచారంలో మినీ సైజ్ విమర్శల యుద్ధం జరిగింది ఈ రెండు పార్టీల మధ్య. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసి గెలిపించారు. హస్తం అధికారంలోకి వచ్చి నెల గడిచిందో లేదో.. రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తమకు 24 గంటలు కరెంట్ ఇవ్వలేదంటూ రైతులు ఆందోళనలు చేస్తన్నారు. ఇప్పుడు కరెంట్ కోతల పర్వం హైదరాబాద్‌కు కూడా చేరింది. జనవరి 17 నుంచి హైదరాబాద్‌లో రెండు గంటలు కరెంట్ కోతలు ప్రారంభం కానున్నాయి.
జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఏరియాల వారిగా 2 గంటల కరెంట్ కోతలు ఉంటాయని విద్యుత్ శాఖ (Electricity Department) అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా అధికారికంగా విడుదల చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్ నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు తప్పవంటూ హెచ్చరించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కరెంట్ కోతలు లేవని.. కానీ కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు తప్పవంటూ చెప్పారు. కానీ ప్రచార సమయంలో కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ విమర్శలను తిప్పకొట్టారు. 24 కరెంట్ ఇచ్చితీరుతామంటూ హామీ ఇచ్చారు. కానీ బీఆర్‌ఎస్ నేతలు ఏం చెప్పారో ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది.
ఇప్పటికే యాసంగి పంట వేసిన రైతలు 24 గంటలు కరెంట్ రావడంలేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి పట్నంలో కూడా కనిపించబోతోంది. దీంతో హైదరాబాద్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మీమర్స్ కూడా ఇంటర్నెట్‌లో ప్రభుత్వం సెటైర్లు వేస్తూ మీమ్స్ చేస్తున్నారు. ఇక పవర్ బ్యాంక్‌లు, ఇన్వర్టర్లు కొనుక్కొవాల్సిన టైం వచ్చిందంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇది బీఆర్‌ఎస్ పార్టీకి మరో ఆయుధంగా మారబోతోంది. ఇప్పటికే కరెంట్ కోతలపై సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదే ఇందిరమ్మ పాలన అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.