భాగ్యనగరంలో అధికారికంగా జనాభా 1.08 కోట్లు. అనధికారికంగా చూసుకుంటే మరో 30 లక్షలు అధికంగా ఉండవచ్చు. అంటే దగ్గర దగ్గర కోటిన్నర జనాభా అనమాట. వీరిలో ప్రతి రోజూ 80 వేల మంది వాహనాలను రోడ్డుపైకి తీసుకొని వస్తారు. పండగలు, వారాంతపు సెలవు దినాల్లో అయితే దీని సంఖ్య 40 నుంచి 50 వేలకు పడిపోతుంది. ఇందులో ప్రతి ఒక్కరూ కార్లనే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వర్షం కారణంగా బైక్ పై వచ్చే వాళ్లు కూడా కార్లనే ఎంచుకుంటున్నారు. అందులో ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రదమ స్థానంలో ఉన్నారు. ఆతరువాత పారిశ్రామిక వేత్తలు, చిన్న చిన్న వ్యాపార సంస్థల వాళ్లు ఉంటారు.
గత మూడు రోజుల నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా తీవ్రమైన ట్రాఫిక్ ఏర్పడుతుంది. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు సరికొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. మంగళ, బుధవారాల్లో ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు మూడు దశల్లో లాగ్ అవుట్ అవ్వాలని సూచించారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా సోమవారం ఒక గంట సేపు కురిసిన కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అదే సమయానికి ఆఫీసుల్లో పని పూర్తి చేసుకొని అందరూ ఇంటికి వెళ్లడంతో ప్రతి ఒక్కరూ తమ వాహనాలను రోడ్లపైకి తీసుకురావాల్సి వచ్చింది. దీంతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించింది.
జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, కేబుల్ బ్రిడ్జ్, ఐకియా, హైటెక్ సిటి ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే నడుము లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురి అయ్యారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మంగళ, బుధవారాలు భారీ వర్షాలు కురుస్తాయన్న సూచనలతో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు విడతల వారీగా లాగ్ అవుట్ విధానాన్ని తీసుకువచ్చారు. నిన్న రాత్రి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తానే స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అర్థరాత్రి వరకూ ఎటు చూసినా వాహనాలే దర్శనమిచ్చాయి. అంత త్వరగా ట్రాఫిక్ అదుపులోకి రాలేదు. కొత్తగా రచించిన ప్రణాళికల ద్వారా ఏమైన సత్ఫలితాలు ఉంటాయేమో చూడాలి.
మూడు రకాలా షిఫ్ట్ డ్యూటీలను తీసుకురావల్సిందిగా సైబరాబాద్ పోలీసులు సూచించారు. ప్రాంతాల వారిగా వీటిని మూడు ఫేజ్ లు రూపొందించారు.
మొదటి ఫేజ్ లో.. ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకూ ఉండే ఐటీ కంపెనీలలో పనిచేసే సిబ్బంది పని గంటల్లో మార్పులు చేశారు. వీరు సాయంత్రం 3 గంటలకు లాగ్ అవుట్ అయ్యేలా చూసుకోవాలి
రెండవ ఫేజ్ లో.. ఐకియా నుంచి బయోడైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ సిబ్బందిని 4.30 గంటలకు లాగ్ ఆవుట్ చేసుకునేలా పనిగంటలు కేటాయించాలని సూచించారు.
మూడవ ఫేజ్ లో.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటలకు పని ముగించుకునేలా చూసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
T.V.SRIKAR