తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని విజయవాడ, గన్నవరం, ఉయ్యూరు, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, మడకశిర, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలంలో వర్షాలు పడుతున్నాయి. విశాఖలోనూ మబ్బులు కమ్ముకున్నాయి.
తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో శని, ఆదివారాల్లో వర్షాలు కురవనున్నాయి. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, VZM, మన్యం, విశాఖ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, GNT, బాపట్ల, అన్నమయ్య, TPT, శ్రీసత్యసాయి, YSR జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.
ఈ రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం..?
మే 26,27 తేదీల్లో పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ పుర్బా మేదినీపూర్, కోల్ కతా, హౌరా, హుగ్లీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఉత్తర ఒడిశాతో పాటుగా.. మిజోరాం, త్రిపుర, మణిపూర్ లపై కూడా తుపాను తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఎండీ వెల్లడించింది.
తుఫాన్ ప్రభావంతో సముద్రం తీర ప్రాంతాల్లో అల్లకల్లోలంగా ఉంటుంతో బెంగాల్, ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్ లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.