పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్ జాం తుఫాన్ బలపడింది. తీవ్ర తుఫాన్ గా బలపడంతో చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. ప్రస్తుతం కోస్త్రాంధ్ర తీరానికి ఆనుకొని ఇది కదులుతోంది. మంగళం ఉదయం ఈ తుఫాన్ మచిలీపట్నం – బాపట్ల మధ్య నిజాం పట్నం దగ్గరల్లో మిగ్ జాం తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరాన్ని దాటే టైమ్ లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురు గాలులు వీచే అవకాశముంది. మంగళవారం అర్థరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. కోస్త్రాంధ్రకు అతి దగ్గరగా వస్తుండంతో… ఏపీలోని రాయలసీమ,కోస్తాంధ్ర జిల్లాలో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. భారీ వర్షాలు, గాలులతో తుఫాన్ బీభత్సం సృష్టించనుంది.
ఏపీలో ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. సూళ్ళూరుపేట, ఒంగోలు, కొవ్వూరు, మచిలీపట్నం, రేపల్లె మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రం నీరు చొచ్చుకొని వచ్చే అవకాశం ఉండటంతో… కొన్ని ఏరియాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. సిటీలో చాలా ఏరియాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. దాంతో వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోకి ఓ భారీ మొసలి కొట్టుకు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. నెదున్ గుండ్రం నది పొంగడంతో ఈ మొసలి కొట్టుకొచ్చినట్టు చెబుతున్నారు. వరద నీళ్ళు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా వెళ్ళాలని చెన్నై అధికారులు సూచిస్తున్నారు. రోడ్ల పక్కన ఉన్న పొదళ్ళలో మొసళ్ళు, పాములు లాంటివి ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు.
చెన్నైఎయిర్ పోర్ట్ మీదా తుఫాన్ ఎఫెక్ట్ బాగా పడింది. ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన 20 విమానాలను రద్దయ్యాయి. మరో 23 విమానాలను బెంగళూరుకు దారి మళ్ళించారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లోకి నీళ్ళు రావడంతో దాదాపు మూతపడింది. చెన్నైలో చాలా ఏరియాల్లో పవర్ కట్ తో జనం అంధకారంలోనే నివసిస్తున్నారు. తమిళనాడులోని చెన్నై సహా 6 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
మిగ్ జాం తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలోనూ ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడే ఛాన్సుంది. మంగళవారం నాడు కొన్ని ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాబోయే రెండు రోజుల వరకూ హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలుపడతాయని IMD అధికారులు తెలిపారు.