Daniel Balaji: తమిళ నటుడు డేనియల్ బాలాజీ చిన్న వయసులోనే మృత్యువు ఒడికి చేరిన విషయం తెలిసిందే. అతని హఠాన్మరణాన్ని కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్ వర్గాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. కొందరు మరణించిన తర్వాత కూడా వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ప్రజల గుండెల్లో సజీవంగా ఉంటారు. సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కావచ్చు.. వారిని చిరంజీవులుగా పదికాలాలపాటు గుర్తుంచుకునేలా చేస్తాయి. అలాంటి ఓ మంచి పని చేయడం ద్వారా డేనియల్ మరణించినప్పటికీ మరో ఇద్దరి రూపంలో సజీవంగా కనిపించబోతున్నాడు.
April 1: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ట్యాక్సుల నుంచి ఇన్సూరెన్స్ దాకా.. మారబోతున్నవి ఇవే..
అవయవాలు దానం చేయండి.. మరణించిన తర్వాత కూడా జీవించండి వంటి ప్రకటనలు మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే దాన్ని సీరియస్‌గా తీసుకునేవారు తక్కువనే చెప్పాలి. ఎంతో మానవత్వం ఉంటే తప్ప అలాంటి నిర్ణయాలు ముందుగానే తీసుకోలేరు అనేది సత్యం. అలాంటి ఓ నిర్ణయం డేనియల్ బాలాజీ మరణానికి ముందే తీసుకున్నారు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ముందు జాగ్రత్తగా తన నేత్రాలను దానం చెయ్యాలని ముందుగానే అనుకున్నాడు డేనియల్. తను చనిపోయినా మరో ఇద్దరికి చూపు ఇవ్వాలన్న ఆయన ఆలోచనకు కుటుంబ సభ్యులు కూడా మద్దతునిచ్చారు. వారి అంగీకారంతో కూడిన ధ్రువ పత్రాన్ని కూడా పొందాడు. ఆయన మరణం తర్వాత కుటుంబ సభ్యులు నేత్రదానానికి సహకరించారు. నేత్రదానానికి సంబంధించిన ఆపరేషన్ పూర్తయిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన నేత్రాలను చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రి వారు సేకరించి భద్రపరిచారు. అలాగే చూపులేని మరో ఇద్దరికి చూపును ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. డేనియల్ భౌతికాయన్ని తిరువాన్మియూర్‌లోని తన స్వగృహానికి తరలించారు.
రేపు ఆయన నివాసంలోనే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. తాను సజీవంగా లేకపోయినా.. మరో ఇద్దరికి తన కళ్లను దానం చేసి తన మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన డేనియల్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు అభిమానులు. డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో రూపొందిన ‘ఘర్షణ’ చిత్రంలో వెంకటేష్ స్నేహితుల్లో ఒకరిగా నటించారు డేనియల్. ఈ పాత్ర అతనికి ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టింది. అలాగే కమల్‌హాసన్ చిత్రం ‘రాఘవన్’లో డేనియల్ నటనకి మంచి ప్రశంసలు లభించాయి.