మెగా వేలానికి డేట్స్ ఫిక్స్ ఆతిథ్యమివ్వనున్న జెడ్డా

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగావేలానికి వేదికగా ఖరారైంది. ఊహించినట్టుగానే విదేశాల్లో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. సౌదీ అరేబియాలోని జెడ్డా సిటీ వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది.

  • Written By:
  • Publish Date - November 6, 2024 / 08:40 PM IST

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగావేలానికి వేదికగా ఖరారైంది. ఊహించినట్టుగానే విదేశాల్లో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. సౌదీ అరేబియాలోని జెడ్డా సిటీ వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. 2023లో దుబాయ్ వేదికగా ఆటగాళ్ళ వేలం జరిగింది. కాగా ఈ సారి వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారత క్రికెటర్లు ఉండగా, 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా సౌతాఫ్రికా నుంచి 91 మంది ప్లేయర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే వేలంలో 10 ఫ్రాంఛైజీలు కలిపి గరిష్టంగా 204 మంది ఆటగాళ్లని మాత్రమే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. కాగా ఈ 204 స్టాట్లలో 70 మంది విదేశీ ఆటగాళ్లకి అవకాశం ఉంటుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ తమ జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాలి. అలానే మ్యాచ్ తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకి మించి ఆడించకూడదు.

మెగా వేలానికి ముందు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాని ఇటీవలే ఫ్రాంచైజీలు ప్రకటించాయి. పది ఫ్రాంచైజీలు 46 మందిని అట్టిపెట్టుకున్నాయి. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకున్నాయి. పంజాబ్ కింగ్స్ ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. ఓవరాల్ గా రిటెన్షన్ కోసం 10 ఫ్రాంచైజీలు 558.5 కోట్లని ఖర్చు చేశాయి. ఈ సారి ఒక ఫ్రాంచైజీకి గరిష్టంగా 120 కోట్లని బీసీసీఐ కేటాయించింది. దీనిలో రిటెన్షన్ కోసం 75 కోట్ల వరకు ఖర్చు చేసుకునే వెసులబాటుని ఇచ్చింది. అయితే రిటెన్షన్ జాబితా కోసం రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా 79 కోట్లు వెచ్చించింది. తర్వాత స్థానంలో 75 కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్‌ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఏకంగా 23 కోట్లని రిటెన్షన్ కోసం ఖర్చుచేసింది.

రిటెన్షన్ జాబితా తర్వాత ఎక్కువ మొత్తం మిగిల్చుకున్న జట్లలో పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఆ ఫ్రాంచైజీ కేవలం ఇద్దరి మాత్రమే రిటైన్ చేసుకుని 110 కోట్ల వేలంలోకి వెళ్ళబోతోంది. అలాగే పంజాబ్ కింగ్స్ తర్వాత వేలం కోసం 83 కోట్లు మిగుల్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్ కోసం 37 కోట్లు మాత్రమే వెచ్చించింది.
విరాట్ కోహ్లీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 కోట్లు ఖర్చు చేసింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్‌ను 21 కోట్లతో అట్టిపెట్టుకుంది. రిటెన్షన్‌లో ఈ ముగ్గురు ప్లేయర్లే టాప్-3లో ఉన్నారు. అయితే.. వేలంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ,శ్రేయాస్ అయ్యర్‌లో ఒకరికి భారీ ధర దక్కే అవకాశం ఉంది. అలానే విదేశీ స్టార్ ప్లేయర్లకీ అదృష్టం వరించే అవకాశాలు లేకపోలేదు.