ఉత్తర్‌ప్రదేశ్ లోని హాథ్రస్ మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట మృతుల సంఖ్య 121కు చేరుకుంది. రిలీఫ్ కమిషనర్ కార్యాలయం వివరాల ప్రకారం ఘటనలో మరో 28 మంది క్షతగాత్రలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మరణాల్లో 19 మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపింది. మరోవైపు, హాథ్రాస్‌లో సత్సంగ్ నిర్వహించినవారిపై పోలీసులు ఎఫ్ఐఐర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు జూలై 3న మతపరమైన సమ్మేళనం నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్సంగ్ ముఖ్య నిర్వహకుడు దేవ ప్రకాశ్ మధుకర్, సికందరరావు తదితరులపై కేసు నమోదైంది. దేవప్రకాష్ మాథుర్‌పై పోలీసులు బిఎన్.ఎస్ సెక్షన్-105, 110, 126, 223, 238 కింద కేసు నమోదు చేశారు. మరో వైపు హాథ్రాస్ తొక్కిసలాట ఘటన పట్ల సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్ గౌరవ్ ద్వివేది పిల్ దాఖలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ విషాదం పట్ల ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. తొక్కిసలాటకు కారణమైన వారిని శిక్షించనున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఇవాళ దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు.
‘భోలే బాబా’ ఎక్కడ..?
ఇంతటి విషాదానికి కారుకులైన నారాయణ్ సాకర్ హరి అలియాస్ బోలే బాబా ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తాజా సమాచారం మేరకు భోలే బాబా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మెయిన్‌పురిలో భోలే బాబాకు చెందిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో సోదాలు నిర్వహించగా అక్కడా ఆయన కనిపించలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ తెలిపారు.