ఎన్నాళ్ళో వేచి చూస్తున్న తరుణం వచ్చేసింది… తెలంగాణా ఆడ బిడ్డ కవితక్కకు లిక్కర్ కేసులో సుప్రీం కోర్ట్ బెయిల్ ఇచ్చేసింది. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పండుగ చేసుకుంటూ, బాపూ వ్యూహాత్మకంగా వ్యవహరించి కవితను తీహార్ జైలు నుంచి బయటకు తెచ్చారు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇందుకోసం 20 మంది ఎమ్మెల్యేలతో కేటిఆర్ ఢిల్లీ వెళ్లి సందడి సందడి చేసి… ఆగమేఘాల మీద ఉరుకులు పరుగులు తీసి, ఆటోలు ఎక్కి చెల్లెలు కోసం సుప్రీం కోర్టు, ట్రయల్ కోర్టు, తీహార్ జైలు, పార్టీ ఆఫీసు ఇలా క్షణం కాళీ లేకుండా గడిపారు.
చెల్లెలు జైలు నుంచి బయటకు రాగానే… పార్టీ మహిళా నేతతో గుమ్మడి కాయ కొట్టించి దిష్టి కూడా తీయించారు. ఇదంతా బాగుంది… చూడటానికి, వినడానికి కూడా బాగుంది. అసలు అలాంటి అన్న మనకు కూడా ఉండాలని ఎంతో మంది చెల్లెళ్ళు అనుకునే ఉంటారు కదా…? ఇక జైలు నుంచి బయటకు రాగానే కవిత అన్నను పట్టుకుని ఏడ్చేశారు. అది చూసి అక్కడున్న బీఆర్ఎస్ నేతలు కూడా కర్చీఫ్ లకు పని చెప్పారు. అక్కడి వరకు ఓకే గాని… ఇదంతా చూసిన వాళ్లకు… ముఖ్యంగా బిజెపి సర్కార్ ను వ్యతిరేకించే వాళ్లకు ఒళ్ళు మండింది.
ఇక బిజేపిని ఇబ్బంది పెట్టాలనే కాంగ్రెస్ వాళ్లకు అయితే అస్త్రం దొరికేసింది. అందుకే బిజెపి అగ్ర నేత, హోం మంత్రి అమిత్ షాకు ఒళ్ళు మండిందట. అసలే 20 రోజుల నుంచి బిజెపిలో బీఆర్ఎస్ విలీనం చేస్తున్నారు, అందుకోసం కవితకు బెయిల్ బిజెపి ఇప్పిస్తుందని సిఎం రేవంత్ రెడ్డితో సహా అందరూ అంటూ వచ్చారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గతంలో ఎప్పుడు బెయిల్ పై విచారణ జరిగినా ఢిల్లీ వెళ్ళని బీఆర్ఎస్ నేతలు… మంగళవారం బెయిల్ పై విచారణ అనగానే 20 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళడం హాస్చర్యానికి గురి చేసింది.
న్యాయస్థానం ఇచ్చే తీర్పుని ఊహించి… అలా చేస్తే గతంలో చాలా సార్లు జరగాలి… కాని తీర్పు ముందే తెలిసినట్టు కేటిఆర్ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న జాతీయ మీడియా ప్రతినిధుల అందరి కళ్ళల్లో కేటిఆర్ పడ్డారు. ఇక తెలుగు మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు మొన్న సాయంత్రం నుంచి వస్తూనే ఉన్నాయి. అందుకే అమిత్ షా… సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మీరు అంత మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ రావాల్సిన అవసరం ఏంటని… అటు న్యాయస్థానాన్ని ఇటు మమ్మల్ని అల్లరి చేసారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
మీరు హైదరాబాద్ లో కూడా కవితకు స్వాగతం బోర్డ్లు ఏర్పాటు చేసుకుని ఆహ్వానించే అవకాశం ఉన్నా సరే ఎందుకు ఢిల్లీ వచ్చారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనితో బెయిల్ మేము ఇప్పించామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని, దీనిపై విపక్షాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసారట. వాస్తవానికి బిజేపిని రాహుల్ గాంధీ ప్రతి అంశంలో ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఎన్డియే సర్కార్ బిల్లులు ప్రవేశ పెట్టె విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంది. మోడీ మాట తీరులో దూకుడు కూడా చాలా తగ్గింది. కేంద్రం నిర్ణయాలు కూడా కాస్త ఆచితూచి ఉంటున్నాయి. ఇప్పుడు ఈ బెయిల్ విషయాన్ని ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకువెళ్ళడం మొదలయింది అంటే అటు న్యాయ వ్యవస్థను కూడా ప్రజల్లో చులకన చేసినట్టే అవుతుంది.