KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై, తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ కేసులో కవితను విచారించేందుకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు.. సీబీఐకి అనుమతించింది. దీంతో తిహార్ జైలులోనే సీబీఐ అధికారులు కవితను విచారించబోతున్నారు. లిక్కర్ స్కాంలో ఈడీ కవితను అరెస్టు చేసి విచారించింది. అనంతరం ఈడీ వినతి ప్రకారం.. కవిత ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో ఉంది.
Kadiyam Kavya: కావ్యకు రెండు పార్టీల్లో శత్రువులు ! గెలుపు అంత ఈజీ కాదా!!
లిక్కర్ స్కాంలో కవితను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. నిజానికి.. గతంలోనే కవితను సీబీఐ విచారించింది. కవిత ఇంటికి వెళ్లి విచారించింది. ఆ తర్వాత గత ఫిబ్రవరి 22న కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని కోరింది. కానీ, తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతోపాటు, విచారణపై తాను వేసిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని తెలిపింది. ఇలా అనేకసార్లు కవిత.. సీబీఐ విచారణ నుంచి తప్పించుకుంది. కానీ, గత నెలలో కవితను ఈడీ అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్లింది. అక్కడ ఈడీ కస్టడీ అనంతరం జుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కవితను విచారించేందుకు, ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ సీబీఐ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కవితను విచారించేందుకు అంగీకరించింది. ప్రశ్నించే ముందు జైలు అధికారులకు ఒక రోజు ముందు సమాచారం ఇవ్వాలని సూచించింది.
అలాగే.. ప్రశ్నించే సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండేలా చూడాలని, ఇతర రూల్స్ కూడా ఫాలో కావాలని ఆదేశించింది. దీంతో తిహార్ జైల్లోనే కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. బుచ్చిబాబు ఫోన్ డేటా ఆధారంగా కవితను సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. కవితను ప్రశ్నించి, కొంత సమాచారం సేకరించిన తర్వాత ఆమెపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేయొచ్చు. మరోవైపు తన కుమారుడి పరీక్షలు ఉన్నందున తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం కోర్టు తీర్పు వెల్లడించనుంది.