Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఊరట.. ఆ పిటిషన్ కొట్టేసిన కోర్టు

జైలులో ఉన్న కేజ్రీవాల్ రాజీనామా చేయాలని, ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మిత్ ప్రీత్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం కొట్టివేసింది.

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 03:15 PM IST

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కాంలో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. అక్కడినుంచే అధికారిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జైలు నుంచి పాలన సాగించడం ఏంటని, ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

Family Star Trailer: హిట్టు ఖాయమా.. ఫ్యామిలీ స్టార్ ట్రైల‌ర్ ఎలా ఉంది..?

ఇదే సమయంలో.. జైలులో ఉన్న కేజ్రీవాల్ రాజీనామా చేయాలని, ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మిత్ ప్రీత్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం కొట్టివేసింది. మరోవైపు.. ఇదే అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలు నుంచి ఢిల్లీ పాలన సాగనివ్వబోమన్నారు. దీనిపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే అవుతుందన్నారు. ఇంకోవైపు.. తన కస్టడీని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో కేజ్రీవాల్ సొంతంగా వాదనలు వినిపించారు. తనను ఇరికించడమే ఈడీ లక్ష్యమన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో CBI 31 వేల పేజీలతో, ఈడీ 25 వేల పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, అయితే, వాటిల్లో ఎక్కడా తన పేరు లేదన్నారు. మాగుంట రాఘవరెడ్డి 7 స్టేట్మెంట్స్‌లో, ఆరింటిలో కూడా తన పేరు లేదని కోర్టుకు తెలిపారు. లిక్కర్ కేసులో రూ.100 కోట్ల అవినీతి జరిగిందంటున్నారని, ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయని కోర్టును ప్రశ్నించారు.

శరత్ చంద్రారెడ్డి అరెస్టయ్యాక బీజేపీకి రూ.55 కోట్లు డొనేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఈడీకి నచ్చినన్ని రోజులు తనను కస్టడీలో ఉంచుకోవచ్చని, తనపై ఏ కేసు లేదని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్. దీనిపై వాదించిన ఈడీ తరఫు లాయర్లు.. తమకు ఈ పిటిషన్ తరఫు కాపీ మంగళవారమే అందిందని, దీనికి బదులిచ్చేందుకు మూడు వారాల సమయం కావాలన్నారు. దీనిపై కేజ్రీవాల్ తరఫు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జాప్యం చేయటానికే పిటిషన్‌పై సమాధానానికి ఈడీ మరింత సమయం కోరుతోందని ఆయన ఆరోపించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది.