తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో హైదరాబాదీలకు గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. నగర శివారుల్లో టౌన్ షిప్స్, మెట్రో రైలు పొడిగింపు లాంటి కీలక నిర్ణయాలను ప్రకటించారు. దేశంలోనే హైదరాబాద్ అన్ని రంగాల్లో స్పీడప్ అవుతోందన్నారు భట్టి విక్రమార్క. నగరం అభివృద్ధిలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా సేవ చేశాయని చెప్పారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న సిటీలో శానిటేషన్, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలను పదేళ్ళుగా నిర్లక్ష్యం చేసినట్టు బీఆర్ఎస్ పై మండిపడ్డారు.
హైదరాబాద్ కి దూరదృష్టితో ప్లానింగ్ చేయలేదనీ… అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోవడంతో హైదరాబాద్ సిటీ అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. ఏవో కొన్ని ప్లై ఓవర్లు కట్టి… అదే అభివృద్ధి అని జనాన్ని భ్రమలో ఉంచారని విమర్శించారు. సిటీలో భూముల వేలంతో వేల కోట్లు వచ్చినా… వాటిని సిటీ డెవపల్ మెంట్ కి ఎందుకు వాడలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పై విమర్శల చేస్తూ… ఈ బడ్జెట్ లో హైదరాబాద్ కి వరాలు ప్రకటించారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిశ్రమలు, ఐటీ సంస్థలు పని చేస్తున్న వాళ్లు రోజూ దూర ప్రయాణాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి వర్క్ ఏరియాకి దగ్గరగానే ఇళ్ళు కూడా ఉండాలి. అప్పుడే సిటీలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు భట్టి. అందుకే హైదరాబాద్ సిటీ శివారుల్లో శాటిలైట్ టౌన్ షిప్‌ల నిర్మాణం ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఈ టౌన్ షిప్‌లో పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరల్లో ఇళ్ళను నిర్మిస్తామన్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటే… పార్కులు, కమ్యూనిటీ హాల్స్, వాణిజ్య సంస్థలు, స్కూళ్ళు అన్నీ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు భట్టి చెప్పారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ప్రైవేట్ వెహికిల్స్ తగ్గించి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని అభివృద్ధి చేస్తామన్నారు. అందుకోసం మెట్రో రైలును పొడిగిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సిటీలో 3 ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉంది. సెకండ్ ఫేజ్ లో శివారు ప్రాంతాలకు కూడా కొత్త ప్రతిపాదనలు తెస్తామన్నారు భట్టి విక్రమార్క.. నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం 78.4 కిలోమీటర్ల పొడవున్న ఐదు కారిడార్లను రూ.24,042 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. మెట్రో రైలును ఓల్డ్ సిటీకి పొడిగించడంతో… శంషాబాద్ ఎయిర్ పోర్టుకు లింకేజ్ చేయబోతోంది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న కారిడార్లను నాగోలు నుంచి LB నగర్ వరకు విస్తరిస్తామని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు భట్టి విక్రమార్క. నాగోలు, ఎల్.బి నగర్, చంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ చేంజ్ స్టేషన్లగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.