ధనుర్మాస ఉత్సవాలకు యాదగిరిగుట్ట సిద్ధమవుతోంది. ఈనెల 16 నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా.. ఉదయం పూట ఆలయంలో జరిగే నిత్య పూజల్లో మార్పులు చేశారు. యాదాద్రి ఆలయ విశిష్టత.. ధనుర్మాస ఉత్సవాల ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం.
యాదగిరిగుట్ట… తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం. నరసింహస్వామి స్వయంభుగా వెలసిన క్షేత్రం. ఈ ఆలయంలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి.. నిత్య పూజలు అందుకుంటున్నారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా కొలువుదీరాడు. ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు. యాదగిరిగుట్టలో ప్రధాన ఆలయంతోపాటు ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది. అంతేకాదు పుష్కరిణి దగ్గర మరో ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలంతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. కొండపై శివాలయంలో శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి కొలువై ఉంటారు. అంటే.. ఈ క్షేత్రంలో శివకేశవులు ఇద్దరూ పూజలు అందుకుంటున్నారు. యాదాద్రి ఆలయంలో ఉదయం, సాయంత్రం స్వామిఅమ్మవార్లకు అర్చనలు జరుగుతాయి.
అనారోగ్యం, గ్రహపీడలతో బాధపడే భక్తులు… ఆలయంలోని విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అలా చేస్తే… సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇప్పటికీ… రోజూ రాత్రిళ్లు ఆ చుట్టుపక్కల కొండలపై తపస్సు చేసుకుంటున్న రుషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారట. వారు వచ్చే సమయంలో మృదంగ ధ్వనులు వినిపిస్తాయని… పాదాల గుర్తులను కూడా కొందరు చూశారని చెప్తుంటారు. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా కనిపిస్తాయట.
యాదాద్రి ఆలయంలో ఏటా ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా ధనుర్మాస ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా.. ఆలయంలో జరిగే నిత్య పూజల్లో స్వల్ప మార్పులు చేశారు. ప్రతి రోజూ తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు సుప్రభాతం నిర్వహిస్తారు. అలాగే.. ఉదయం 4గంటల నుంచి 5గంటల వరకు తిరువారాధ, బాలభోగం, ఆరగింపు ఉంటాయి. ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటల 45 నిమిషాలకు తిరుప్పావై పారాయణ చేస్తారు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాల గోష్టి జరుగుతుంది. ఆ తర్వాత ఆరు గంటల 45 నిమిషాల వరకు నిజాభిషేకం, 7 గంటల 15 నిమిషాల వరకు సహస్రనామార్చన జరుగుతాయి. 7 గంటల 15 నిమిసాల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా… జనవరి 13వ తేదీన రాత్రి 7గంటలకు గోదా కళ్యాణం ఉంటుంది. 14వ తేదీ ఉదయం పదకొండున్నరకు ఒడిబియ్యం సమర్పిస్తారు.